Burning Topic: ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఎవరికీ దక్కని మెజార్టీ!

Burning Topic: ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో కొనసాగుతున్న సందిగ్ధత, అరబ్ పార్టీల మద్దతు మరియు విదేశీ నిధుల ఆరోపణలపై విచారణ ఉత్తర్వులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 7:20 AM IST
Burning Topic
X

Burning Topic: ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఎవరికీ దక్కని మెజార్టీ!

Burning Topic: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఇజ్రాయెల్‌ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయినా సందిగ్ధత కొనసాగుతోంది. ఏ కూటమికి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఏ కూటమికీ లభించలేదు. దీంతో ఇతర పక్షాల మద్దతు కూడగట్టడం సమస్యగా మారింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాట చేయడంతో సంక్లిష్ట పరిస్థితులు తప్పడ లేదు. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ కనెస్సెట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 స్థానాలు అవసరం.

ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి కూటమికి 53 స్థానాలే దక్కాయి. ఇందులో ఇయన పార్టీ లికుడ్ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మెజారిటీ సరిపోదు. కూటమిలోని యునైటెడ్ తోరా జుడాయిజం, ఒట్జ్మా యెహుదిత్ పార్టీకు చెరో 7 సీట్లు, షాస్, రిలిజియస్ జియోనిస్ట్ పార్టీలకు చెరో 6 సీట్లు లభించాయి.

మరోవైపు మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐసెన్‌కాట్‌ నాయకత్వంలోని కూటమికి 48 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇందులో ఐసెన్‌కాట్‌ పార్టీ యాషార్ కు 21 సీట్లున్నాయి. ఈ కూటమిలోని బియాచద్ పార్టీ 12, ది డెమొక్రాట్స్ పార్టీ 8, ఇజ్రాయెల్ బేతేను 7 సీట్లును దక్కించుకుంది. కాగా ఆ ఎన్నికల్లో అరబ్ పార్టీలు ఏకంగా 19 సీట్లు సాధించడం కలకలం రేపుతోంది. ఇందులో ది జాయింట్ లిస్ట్ పార్టీ 12 సీట్లు గెలవగా, రాఆమ్ 7 సీట్లు పొందింది. ఏ కూటమికీ సొంతంగా మెజారిటీ దక్కక పోవడంతో అరబ్ పార్టీల కూటమి మద్దతు కీలకంగా మారింది.

అయితే అధికారికంగా ఎన్నికల ఫలితాలను నవంబర్ 4 న ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు సమర్పించడంతో పాటు అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై వివిధ పార్టీల అధినేతలతో అధ్యక్షుడు సంప్రదింపులు జరుపుతారు. నవంబర్ 10న నూతనంగా ఎన్నికైన 26వ కనెస్సెట్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అప్పటి లోగా ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం తేలేలా లేదు.

ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ దక్కక పోవడంతో అరబ్ పార్టీల కూటమి మద్దతు కీలకమైంది. ఇజ్రాయెల్ జనాభాలో సుమారు 21 శాతం ఉన్న అరబ్ పౌరులు యూదులతో పోలిస్తే ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే మారిన పరిణామాలతో ఈసారి వారు పెద్ద సంఖ్యలో ఓటేసేందుకు తరలి రావడం ఫలితాలపై ప్రభావం చూపింది, దీంతో ప్రభుత్వ ఏర్పాటులో అరబ్ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. గతంలో అరబ్ పార్టీలతో పొత్తును వ్యతిరేకించిన ప్రధాన నేతలు ఇప్పుడు వాటి మద్దతుపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, సిద్ధాంతపరమైన విభేదాలు, పొత్తులపై విధిస్తున్న షరతులు ఈ చర్చలకు అడ్డంకిగా మారవచ్చు. అరబ్ పార్టీల మద్దతును ప్రధాన కూటములు ఎలా వినియోగించుకుంటాయన్నదే ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించనుంది. ఇప్పుడుప్రధాని బెంజమిన్​ నెతన్యాహు మరోసారి పదవి బాధ్యతలు చేపడతారా? గాడీ ఐసెన్‌కోట్‌ ప్రధాని పదవి చేపడతారా అనే చర్చ మొదలైంది.

అరబ్ పార్టీలతో కలిసి పనిచేయడం లేదా వాటి మద్దతు తీసుకోవడం అనేది యూదు పార్టీలకు రాజకీయంగా సున్నితమైన అంశం. ఆ పార్టీలతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దని ప్రధాని నెతన్యాహూ జియోనిస్ట్ పార్టీలకు ఎన్నికలకు ముందే పిలుపునిచ్చారు. అరబ్ పార్టీలతో ప్రత్యర్థులు చేతులు కలిపితే ప్రమాదకర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆరోపించారు. ‘రైట్ ఆర్ పాలస్తీన్’ అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు. నెతన్యాహూ ఎట్టి పరిస్థితిల్లో వారి మద్దతు తీసుకునే అవకాశం లేదు.

అయితే ఐసెన్‌కోట్ అరబ్ పార్టీలతో ఒప్పందానికి కొన్ని షరతులు విధించారు. ఇజ్రాయెల్‌ను యూదు, ప్రజాస్వామ్య దేశంగా గుర్తించడం, స్వాతంత్య్ర ప్రకటనలోని విలువలను అంగీకరించడం, పాలస్తీనా పౌరులకు సైనిక సేవను వర్తింపజేయడాన్ని సమర్థించడం, హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా స్పష్టంగా ఖండించడం వాటిలో ఉన్నాయి. సాధారణంగా పాలస్తీనా పౌరులకు తప్పనిసరి సైనిక సేవ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ షరతులను అరబ్ పార్టీలు అంగీకరించడం కష్టమయ్యే అవకాశముంది.

కాగా తాము అధికారంలో భాగస్వామి కావాలని రాఆమ్ పార్టీ నేత మన్‌సూర్ అబ్బాస్ కోరుకుంటున్నారు. ఆయన నెతన్యాహు, ఆయనకు మద్దతు తెలిపే కఠిన వైఖరి కలిగిన మంత్రులు బెజలెల్ స్మోట్రిచ్, ఇతమార్ బెన్ గ్విర్‌ను అధికారానికి దూరం చేయాలని కోరుకుంటున్నారు. ఐసెన్‌కోట్‌తో కలిసి పనిచేసే అవకాశాలపై ఆయన ఆశాభావంతో ఉన్నారు. గతంలో నఫ్తాలి బెన్నెట్ నేతృత్వంలోని ప్రభుత్వంలో రాఆమ్ పార్టీ భాగస్వామిగా ఉంది.

అరబ్ సమాజానికి సేవ చేయడానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం మాత్రమే సరిపోదని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మా సమస్యలకు పరిష్కారంలో భాగస్వాములం కావాలని, అరబ్బులు, యూదులు ఇద్దరికీ ఆశ కల్పించాలని నిర్ణయించుకున్నాం అని మన్‌సూర్ అబ్బాస్ తెలిపారు. “కేవలం ప్రాతినిధ్యానికే పరిమితం కాకుండా, నిర్ణయాలను ప్రభావితం చేయగల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో మా విధానం రూపుదిద్దుకుంది” అని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా ఇజ్రాయెల్ ఎన్నికలకు విదేశీ నిధులు అందాయనే ఆరోపణలు రావడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపింది. ఖతార్ నుంచి భారీగా నిధులు వచ్చి, అరబ్ ఓటర్ల ఓటింగ్‌పై ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు జరిగి ఉండవచ్చని హిబ్రూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఓటర్లను పోలింగ్‌కు రప్పించడం లేదా వారి ఓటింగ్‌పై ప్రభావం చూపేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిధుల బదిలీకి ఉపయోగించిన మార్గాలు గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు చేరవేసేందుకు ఉపయోగించిన పద్ధతులను పోలి ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నోమ్ సోల్‌బర్గ్ దేశ భద్రతా సంస్థ షిన్ బెట్‌ను ఆదేశించారు. వారంలోగా దర్యాప్తు వివరాలను సమర్పించాలని కోరారు. ఈ అనుమానాల వాస్తవికతను ధ్రువీకరించలేనప్పటికీ, విదేశీ సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

మరోవైపు, అరబ్ పార్టీలతో ఓట్ల చోరీ జరిగిదంటూ ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఆరోపించింది. ఖతార్ పేరు ప్రస్తావించకుండా, విదేశీ శక్తులు ఇజ్రాయెల్ పార్లమెంటును తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాయని పేర్కొంది. విదేశీ సంస్థలు అరబ్ పార్టీలకు అనుకూలంగా ఓటర్లకు లంచాలు ఇచ్చాయన్న న్యాయమూర్తి వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని నెతన్యాహూ తెలిపారు. ఈ నేపథ్యంలో అరబ్ పార్టీలతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దని జియోనిస్ట్ పార్టీలకు పిలుపునిచ్చారు.

ఈ నేరాలపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరబ్ పార్టీల నాయకులను విచారించాలని, అరెస్ట్ చేయాలని నెతన్యాహు కూటమిలోని ముఖ్య నేతలు డిమాండ్ చేశారు.గాడి ఐసెన్‌కోట్ కూడా విచారణను స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే విదేశీ జోక్యం ఆరోపణలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి కొత్త పార్లమెంటు ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయకూడదని హెచ్చరించారు. ప్రతి ఫిర్యాదుపైనా దర్యాప్తు జరగాలన్నారు.

ఇదిలా ఉంటే స్పష్టమైన మెజారిటీ సాధించడంలో తమ కూటమి విఫలమైన వేళ బెంజమిన్ నెతన్యాహు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. విపక్ష నేత ఐసెన్‌కోట్ భాగస్వామ్యంతో 'జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని' ఏర్పాటు చేయాలని నెతన్యాహు మిత్రపక్షాలు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసెన్‌కోట్‌ను నెతన్యాహు ప్రభుత్వంలోకి తీసుకురావాలని ప్రధాని సన్నిహితులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు.

ఇందు కోసం ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రెండు ప్రతిపాదనలపై దృష్టి సారించారు. అందులో మొదటిది రొటేషన్ పద్ధతి. తొలి రెండేళ్ల పాటు నెతన్యాహు ప్రధానిగా కొనసాగుతారు, ప్రభుత్వ కాలవ్యవధి ముగిసే వరకు ఐసెన్‌కోట్ ప్రధాని బాధ్యతలు చేపడతారు. ఇక రెండోది నెతన్యాహు ప్రధానిగానే కొనసాగుతూ, ఐసెన్‌కోట్‌కు కీలక మంత్రి పదవిని అప్పగించడం. ఈ ప్రతిపాదనలు ఎంత వరకూ వాస్తవ రూపం దాల్చుతాయో వేచి చూడాల్సిందే.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్