BURNING TOPIC: సైబర్ ఉగ్రవాదం కొత్త రూపం.. ఫ్రిజ్‌లే టార్గెట్!

BURNING TOPIC: ఉక్రెయిన్, రష్యాలలో సైబర్ దాడి కలకలం. అధికారిక యాప్‌లు హ్యాక్ చేసి నకిలీ హెచ్చరికలు. ఐరోపా దేశాల్లో సూపర్ మార్కెట్ ఫ్రిజ్‌లపై కూడా సైబర్ దాడులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Nov 2026 8:14 AM IST
BURNING TOPIC
X

BURNING TOPIC: సైబర్ ఉగ్రవాదం కొత్త రూపం.. ఫ్రిజ్‌లే టార్గెట్!

BURNING TOPIC: ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది. బాంబు పేలుళ్లు, తుపాకుల శబ్దాలు లేవు.. డిజిటల్ ప్రపంచంలో దాడులు కీబోర్డులతో జరుగుతున్నాయి.. ఒక క్లిక్ వ్యవస్థలను అతలాకుతలం చేయగలదు. వైరస్, మాల్వేర్ దాడితో పవర్ గ్రిడ్‌లను నిలిపివేయవచ్చు, రక్షణ రహస్యాలను దొంగిలించవచ్చు, ఆర్థిక వ్యవస్థను కూల్చేయవచ్చు. అదే సైబర్ ఉగ్రవాదం. ఆధునిక ప్రపంచానికి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ డిజిటల్ దాడులు, మానవజాతి భద్రతకు సరికొత్త సవాలుగా నిలుస్తున్నాయి.. తాజాగా ఉక్రెయిన్‌, రష్యాలలో సైబర్‌ దాడులు కలకలం సృష్టించాయి. రెండు దేశాల్లో అత్యవసర హెచ్చరికలు పంపే అధికారిక యాప్‌లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. అణు దాడులు, రేడియేషన్‌ ముప్పు, రసాయన దాడులు, వీధుల్లో కాల్పులు జరుగుతున్నాయంటూ సందేశాలు వెలువడ్డాయి. దీంతో రెండు దేశాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.. ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రేడియోధార్మికత విపరీతంగా పెరిగిపోయిందని, ప్రజా సంక్షోభం, విష రసాయన ప్రభావం అంటూ మొబైల్ ఫోన్లకు రకరకాల సందేశాలు వచ్చాయి. అలాగే లౌడ్‌ స్పీకర్ హెచ్చరిక వ్యవస్థ కూడా హ్యాకింగ్‌కు గురై కీవ్ వీధులంతటా ఇలాంటి సందేశాలనే ప్రసారం చేసింది. కొందరికైతు వీధుల్లో పోరాటాలు జరుగుతున్నాయని మెసేజ్‌లు రావడంతోత తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న పని అని, వీటిని పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. కొంత సమయానికి లోపాలను సరిదిద్దామని, సైబర్‌ దాడుల వల్ల మిలటరీ వ్యవహారాలకు ఎలాంటి నష్టమూ జరగలేదని వివరించారు. ప్రసారమైన తప్పుడు సందేశాల్లో అచ్చుతప్పులున్నాయని, రష్యా, ఉక్రెయిన్‌ భాషలు కలగలసిపోయాయని తెలిపారు. ఇదిలా ఉంటే రష్యా కూడా తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని తెలిపింది.

అటు రష్యాలోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకుంది. అనేకప్రాంతాలపై అణు వార్‌హెడ్లతో కూడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు దూసుకొస్తున్నాయంటూ నకిలీ హెచ్చరికలు జారీ అయ్యాయి. మూడు వారాలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకుని, సురక్షిత ప్రాంతాల్లో దాక్కోవాలని అందులో పేర్కొన్నారు. తమ అధికారిక యాప్‌పై భారీ సైబర్‌ దాడి జరిగిందని, ప్రజలకు తప్పుడు సమాచారం చేరిందని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా అధ్యక్ష భవనం సహా ప్రభుత్వ ఇంటర్నెట్‌ వ్యవస్థలన్నీ నిరంతరం సైబర్‌ దాడులకు గురవుతున్నాయని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికత విస్తరణ కూడా సైబర్‌ దాడులు పెరగడానికి కారణమవుతోందన్నారు. ఉక్రెయిన్‌లో ఖెర్సన్‌ ప్రాంతంలో అమల్లో ఉన్న స్థానిక కాల్పుల విరమణ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు ఈ నకిలీ హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ ఘటనలపై రెండు దేశాల్లోనూ విచారణ జరుగుతోంది.

కాగా సైబర్ దాడుల సమస్య రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రభుత్వాలకు, సైనిక వ్యవస్థలకే పరిమితం కాదలేదు. తాజాగా సామాన్యుల దైనందిన జీవితాలపై కూడా ప్రభావం చూపే స్థాయిలో జరిగిన పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. యూరోప్‌ దేశాల్లోని అనేక సూపర్ మార్కెట్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, రిఫ్రిలరేటర్లు హఠాత్తుగా వేడెక్కిపోయాయి. ఒక్కసారిగా 50 డిగ్రీలసెల్సియస్‌ ఉష్ణోగ్రత్తలు దాటిపోయి పనికి రాకుండా పోయాయి. ఫలితంగా అందులోని చేసిన ఆహార పదార్ధాలు అన్నీ చెడిపోవడంతో పారేయాల్సి వచ్చింది. స్వీడన్, బెల్జియం, లక్సంబర్గ్, ఐర్లాండ్, ఈస్టోనియా దేశాలలోని పలు సూపర్‌ మార్కెట్లలో ఈ అనూహ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనే అని భద్రతా నిపుణులు గుర్తించారు. ఫ్రాన్స్‌లోనూ దాదాపు 700 స్టోర్ల శీతలీకరణ వ్యవస్థలు కూడా ఇలాగే సైబర్‌ దాడులకు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు ఫ్రీజింగ్ వ్యవస్థలను డీఫ్రాస్ట్‌ మోడ్‌లోనే ఎక్కువ సమయం కొనసాగేలా చేస్తున్నారు.

కొంత కాలంగా ఏసీలతో పాటు రిఫ్రిజిరేషన్‌ వ్యవస్థల నియంత్రణకు ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సూపర్‌ మార్కెట్లలో కేంద్రీకృత కూలింగ్‌ వ్యవస్థలుంటాయి. వీటి నిర్వహణ కోసం రిమోట్‌ యాక్సెస్‌ను వాడతారు. ఫ్రీజర్లు, ఫ్రిజ్‌లలో సాధారణంగా మైనస్‌ ఉష్ణోగ్రతలను మెయింటెయిన్‌ చేస్తుంటారు. అయితే హ్యాకర్లు ఈ వ్యవస్థను తమ నియంత్రణలోకి తీసుకొని సైబర్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. వారు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. రిఫ్రిజిరేషన్‌ పరికరాలకు కంప్యూటర్‌ సిస్టంలద్వారా కమాండ్ఇస్తారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలను 50 డిగ్రీల సెల్సియస్‌కు పెంచడంతో అవి వేడెక్కిపోతాయి. వేడెక్కిన ఆహారాన్ని మళ్లీ చల్లబరిచినా ప్రయోజనం ఉండదు. కొన్ని ఆహార పదార్థాలే అలా చేస్తే ఉపయోగపడతాయి. మిగిలిన వాటిని పడేయాల్సిందే. ఆహార పదార్ధాలు చెడిపోడంతోపాటు రిఫ్రిజరేటర్లు కూడా పనికి రాకుండా పోతున్నాయి. ఫలితంగా వ్యాపారులు నష్టపోతున్నారు.

సైబర్ దాడులకు ఎక్కువగా ఇంటర్‌మార్చ్, నెట్టో, క్యారీఫోర్, మోనోప్రిక్స్, కో–ఆపరేటివ్‌ యూ, ఈ–లెక్‌లెర్క్‌లు ఎక్కువగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. కాగా సైబర్ దాడుల బారిన పడకుండా తగిన జాత్రత్తలు తీసుకోవాలని ఫ్రాన్స్‌కు చెందిన సీఈఆర్‌టీ-ఎఫ్‌ఆర్‌ సూచించింది.పాత తరం కంట్రోలర్లను మార్చాలని, కొత్త పరికరాలను ఇంటర్నెట్‌ను బహిరంగంగా అనుసంధానం చేయవద్దని కోరింది.

కూలింగ్‌ వ్యవస్థలకు సంబంధించిన పరికరాలన్నీ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలి. అలాగే వాటి రిమోట్‌ యాక్సెస్‌ను పరిరక్షించాలి. నేరుగా ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో లేకుండా చూసుకోవాలి. పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. సెట్టింగ్‌లను తనిఖీ చేసుకోవాలి. ఇందుకు సహకరించని వ్యవస్థలను పూర్తిగా మార్చేయాలని సూచిస్తున్నారు. కాగా భారత్‌లోనూ స్టోరేజ్‌ కేంద్రాల్లో, రవాణా వాహనాల్లో, విక్రయ కేంద్రాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థలు ఉన్నాయి. దీంతో సైబర్ దాడుల ముప్పుపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని సైనిక స్థావరాల ఆహార పంపిణీ వ్యవస్థలపై సైబర్ దాడి జరిగినట్లు గుర్తించారు సైనిక స్థావరాలలోని ఫ్రీజర్లలో సమస్యలు తలెత్తాయి. అవి చల్లబడటానికి బదులు.. వేడెక్కాయి. రాత్రికి రాత్రే కూలింగ్ యూనిట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. లోపల నిల్వ ఉంచిన ఆహారం ఉదయానికల్లా పాడైపోయింది. దాదాపు దేశ వ్యాప్తంగా 12కుపైగా సైనిక స్థావరాల్లోని వంటశాలల్లో ఈ సస్య చోటు చేసుకుంది. దీంతో అక్కడి సైనికులు ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ఒకేసారి అన్ని స్థావరాలలో ఫ్రీజర్లు పనిచేయకపోవడం దీని వెనుక సైబర్‌ నేరగాళ్ల హస్తం ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీని వెనుక శత్రు దేశాల కుట్ర, ఇతర రాజకీయ కోణాలు కూడా ఉండే అవకాశముందన్నారు. తాజాగా యూరోప్ దేశాల్లో ఫ్రీజర్లు కూడా ఇదే విధంగా వేడెక్కి పోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే రెండు రకాల సైబర్ దాడులకు సంబంధాలు ఉన్నాయని గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్