off the record: బీఆర్ఎస్ అడ్డాల్లో కాంగ్రెస్ దూకుడు!

off the record: తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ కీలక నేతల భూ ఆక్రమణలపై కాంగ్రెస్ దూకుడు. సర్వే నెంబర్లతో సహా బట్టబయలు చేస్తూ జిల్లాల్లో వరుస బహిరంగ సభలకు వ్యూహం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Sept 2026 11:32 AM IST
off the record
X

off the record: బీఆర్ఎస్ అడ్డాల్లో కాంగ్రెస్ దూకుడు!

off the record: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఆ ఫ్యామిలీ, ఆ పార్టీ ముఖ్యనేతలేనా..? వాళ్ళపై విమర్శలు చేయడంతో పాటు పక్కా ఆధారాలతో ప్రజల్లోకి వెళ్తున్నారా..? వాళ్ల నెక్స్ట్ ప్లాన్ అదేనా..? అంటే... 'అవుననే' అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.

"ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. మాజీ సీఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీతోపాటు వారి ముఖ్య అనుచరులు ప్రభుత్వ భూములను 'ధరణి'ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కబ్జా చేశారో సర్వే నెంబర్లతో సహా బట్టబయలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం అసెంబ్లీ ప్రసంగానికి మాత్రమే పరిమితం కాకుండా, కాంగ్రెస్ ప్రతినిధుల బృందాన్ని నేరుగా ఆ భూముల్లోకి పంపించారు.

ముఖ్యంగా హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్‌ల భూములను ఎంపీ, ఎమ్మెల్సీల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అసెంబ్లీలో ప్రకటన చేసిన వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు అధికారులు వెళ్లి ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత రోజు నుంచి వరుసగా విజిట్లు ప్రారంభమయ్యాయి.

హరీష్ రావు మామ కొండపాకలోని ఐదు ఎకరాల భూమి, అలాగే రంగనాయక సాగర్ లోని ఐదు ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఎంపీలు ఆధారాలు చూపించారు. 'అధికారులు ప్రభుత్వ భూములకు ఎలా ఎన్ఓసీ ఇచ్చారు..?' అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను నిలదీశారు."

"ఇక అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత రోజు కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నట్లు చెప్పే జన్వాడ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ బృందం వెళ్లింది. అక్కడ భూమిని పరిశీలించి, 'నాలాలను ఆక్రమించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చివేయలేదు..?' అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు.

ఆ తర్వాత అజీజ్‌నగర్‌లోని హరీష్ రావు ఫామ్‌హౌస్, శంషాబాద్‌లోని జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్ వద్దకు కూడా నేరుగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. బీఆర్ఎస్ కీలక నేతల అక్రమాలపై కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా, దస్తావేజులతో సహా బయటపెడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తోందట కాంగ్రెస్.

"ఇప్పుడు ఈ వివాదం కేవలం ఫామ్ హౌస్‌లకే పరిమితం కాలేదట. ప్రధాన నేతల సొంత నియోజకవర్గాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారట. అందులో భాగంగానే కేటీఆర్ అడ్డా అయిన సిరిసిల్లలో ఈ నెల 30న భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడ మోహరించారు.

ముఖ్యంగా నేతన్నలకు గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో వివరిస్తూ, తాము రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో ఆ సభ నుంచే స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారట. అలాగే నేతన్నలకు రావాల్సిన నిధుల వివరాలను సైతం ఆ వేదికపై నుంచి వెల్లడించనున్నారు కాంగ్రెస్ వర్గాలు.

"సిరిసిల్ల సభ ముగిసిన తర్వాత, వచ్చే రెండు మూడు నెలల్లో గజ్వేల్, సిద్దిపేట, సూర్యాపేట లాంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా వరుస సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు. ముఖ్యంగా డిసెంబర్ 9న ఒక భారీ బహిరంగ సభను సిద్దిపేట లేదా గజ్వేల్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. ప్రధాన ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయమే ఉండటంతో, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌లోని కీలక నేతల మీద కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అందులో భాగంగానే కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరున్న జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌ల నియోజకవర్గాలపై కూడా గట్టిగా కన్నేసి ఉంచారట. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాంతాలలో పర్యటించి, గతంలో జరిగిన అన్యాయాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు అవినీతి బాగోతాలను ప్రజల ముందుంచాలని ఫిక్స్ అయ్యారట.

మొత్తానికి.. ఓ వైపు ప్రధాన ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తూనే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అవినీతిని వాళ్ల సొంత నియోజకవర్గాల ప్రజలకు పూసగుచ్చినట్లు తెలియజెప్పాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. మరి ఈ రాజకీయ వ్యూహాలు ఏ మేర ఫలితాలను ఇస్తాయో..? ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా ప్రభుత్వ ఎదురుదాడిని ఏవిధంగా తిప్పికొట్టగలదో వేచి చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్