Off The Record: బిగ్ ట్విస్ట్ .. కాంగ్రెస్ కు రాంరెడ్డి బిగ్ షాక్!

Off The Record: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి ప్రకటన వెనుక ఆసక్తికర పరిణామాలు, సూర్యాపేట టికెట్ ఆశలపై రాజకీయ విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Oct 2026 7:54 AM IST
Off The Record
X

Off The Record: బిగ్ ట్విస్ట్ .. కాంగ్రెస్ కు రాంరెడ్డి బిగ్ షాక్! 

Off The Record: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరును సడన్‌గా ప్రకటించింది. జాబితాలో తన పేరు చూడగానే ఆయన సంతోషిస్తారని భావిస్తే.. కథ అడ్డం తిరిగిందట. అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కావాలని తాను ఎవరినీ అడగలేదని,

తన ప్రమేయం లేకుండానే పేరు ఎలా వచ్చిందో తెలియక కంగుతిన్నానని సర్వోత్తమ్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, సంప్రదించకుండానే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ పోటీకి ఏమాత్రం సిద్ధంగా లేనని తేల్చిచెబుతున్నట్లు ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరి సర్వోత్తమ్ రెడ్డి ఎమ్మెల్సీ పోటీకి ఎందుకు వెనుకాడుతున్నారు..? దీని వెనుక బలమైన రాజకీయ ఆకాంక్ష ఉందనే చర్చ నడుస్తోంది. దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడైన సర్వోత్తమ్ రెడ్డికి తన తండ్రికి రాజకీయంగా ఎంతో అనుబంధం ఉన్న సూర్యాపేట నియోజకవర్గంపైనే దృష్టి ఉందట.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలవాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యమని సమాచారం. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే, భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోతుందేమోనన్న అనుమానమే ఆయన విముఖతకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

అందుకే వరుసగా పార్టీ కీలక నేతలను, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులను కలిసి "నాకు ఎమ్మెల్సీ వద్దు.. సూర్యాపేట ఎమ్మెల్యే టికెటే ముద్దు" అని మనసులోని మాటను విన్నవిస్తున్నారట. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ పరిణామంతో తీవ్ర ధర్మసంకటంలో పడింది. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ససేమిరా అంటున్నా.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అభ్యర్థి మార్పు కుదరదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థిని మార్చితే పార్టీకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం భావిస్తోందట. దీంతో పోటీకి వెనుకంజ వేస్తున్న సర్వోత్తమ్ రెడ్డిని ఒప్పించేందుకు బుజ్జగింపు పర్వాలు ప్రారంభించిందట.. ఢిల్లీ పెద్దలు, రాష్ట్ర ముఖ్య నేతలు ఆయనకు నచ్చజెప్పి ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారట.

ఏది ఏమైనా.. ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఈ పరిణామం అగ్నిపరీక్షగా మారింది. ఒకవైపు ప్రకటన వెలువడిన క్షణం నుంచే వివాదం రేగడంతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం పడుతుందేమోనని శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

అధిష్టానం పిలుపు మేరకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మెట్టు దిగి ఎమ్మెల్సీ బరిలో నిలబడి ప్రచారం ప్రారంభిస్తారా..? లేదా తన సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆకాంక్షకే కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ సర్వోత్తమ్ రెడ్డి వెనక్కి తగ్గితే.. పార్టీ కొత్త అభ్యర్థిని వెతుక్కునే పరిస్థితి వస్తుందా..? లేక బుజ్జగింపులతోనే ఈ వ్యవహారాన్ని సర్దుమణిగిపోయేలా చేస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పొలిటికల్ డ్రామా ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్