Off The Record: విజయశాంతి వ్యూహం ఏమిటి!
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి తీవ్ర మౌనం వహించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Off The Record: విజయశాంతి వ్యూహం ఏమిటి!
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పుడు అత్యంత దూకుడుగా వినిపించిన స్వరం.. ఇప్పుడు దాదాపు మూగబోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ నేత మరెవరో కాదు.. నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి.
ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంలోనూ, పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించడంలోనూ విజయశాంతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ సభ అయినా... టీవీ డిబేట్ అయినా... సోషల్ మీడియా వేదికైనా... తనదైన స్టయిల్లో స్పందించే రాములమ్మ.. ఇప్పుడు మాత్రం పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది.
సినిమాల్లో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిన విజయశాంతి.. రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచారు. కానీ ప్రస్తుతం మాత్రం వార్తల్లో కంటే గుసగుసల్లోనే ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయశాంతి.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన రాములమ్మకు.. పార్టీ హైకమాండ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించకపోయినా.. అధిష్టానం ఆమెపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. దీంతో ఇక కాంగ్రెస్‌లో విజయశాంతి రెండో ఇన్నింగ్స్ మరింత దూకుడుగా సాగుతుందని అందరూ భావించారు.
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కొద్ది కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన విజయశాంతి.. క్రమంగా ప్రజా వేదికలకు దూరమయ్యారు. పార్టీ నిర్వహించే కీలక కార్యక్రమాల్లో సైతం ఆమె హాజరు కావడం లేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇటీవల టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన "ఛలో లోక్ భవన్" కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. కానీ అక్కడ విజయశాంతి మాత్రం కనిపించలేదు. దీంతో ఆమె గైర్హాజరు మరోసారి చర్చనీయాంశమైంది.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సైతం తెలంగాణ నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ స్వయంగా పిలుపునిచ్చిన కార్యక్రమాలకు రాష్ట్ర నాయకత్వం భారీగా మద్దతు తెలిపింది. కానీ అక్కడ కూడా విజయశాంతి ఆనవాళ్లు కనిపించలేదని పార్టీలోనే కొందరు చర్చించుకుంటున్నారట.
గాంధీ భవన్లో జరిగే సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె హాజరు చాలా అరుదుగా మారిందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. "రాములమ్మను చూసి చాలా రోజులైపోయింది" అనే వ్యాఖ్యలు కూడా పార్టీ ఆఫీసు కారిడార్లలో వినిపిస్తున్నాయట. కాంగ్రెస్‌లో మాస్ అప్పీల్ ఉన్న నేతలు చాలా తక్కువమందే ఉన్నారని.. అందులో విజయశాంతి పేరు కచ్చితంగా ముందుంటుందని చెబుతున్నారు. మహిళల్లోనూ, సినీ అభిమానుల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉందని.. అలాంటి నాయకురాలిని పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ పదవి లభించినప్పటికీ.. మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు విజయశాంతి వర్గాల్లో ఉన్నాయని, అయితే అది జరగకపోవడంతో కొంత నిరాశ ఏర్పడిందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆమె పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా యాక్టివ్‌గా ఉండటం లేదని కొందరు విమర్శకులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ప్రచారాలపై విజయశాంతి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. దీంతో ఆమె మౌనం చుట్టూ మరింత ఉత్కంఠ పెరుగుతోంది. అసలు విజయశాంతి రాజకీయంగా వెనక్కి తగ్గారా..? లేక సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా..? లేక కాంగ్రెస్‌లో తన పాత్రపై మరింత స్పష్టత వచ్చిన తర్వాతే మళ్లీ యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా..? ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లేదు.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ స్వరంగా మారిన విజయశాంతి.. ఇప్పుడు తన మౌనంతోనే చర్చనీయాంశంగా మారిపోయారు.




