Off The Record: కేసీఆర్ కంచుకోటలపై రేవంత్ దాడి వ్యూహం!
Off The Record: బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. సిరిసిల్ల సభ సక్సెస్ ఊపుతో సిద్దిపేట, గజ్వేల్‌లోనూ భారీ సభలకు ప్లాన్.
Off The Record: కేసీఆర్ కంచుకోటలపై రేవంత్ దాడి వ్యూహం!
Off The Record: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా వ్యూహంలో భాగంగా.. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించి భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్లలో దాదాపు 350 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇందులో నేతన్న బజార్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు మరియు కొత్త ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభం ఉన్నాయి. కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సుమారు 30 నిమిషాల పాటు మంత్రులు, స్థానిక నేతలతో కలిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. అయితే, అభివృద్ధి పనులతోపాటు రాజకీయంగానూ కేటీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశం, ఇసుక తవ్వకాలు, మరియు నేతన్నల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
సిరిసిల్ల సభ సక్సెస్ జోష్‌తో ఇదే తరహాలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో అక్టోబర్‌లో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం, గత ప్రభుత్వ నిర్ణయాలు, భూముల కేటాయింపులు ప్రధాన రాజకీయ అస్త్రాలుగా మారనున్నాయి. ఆ వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌లోనూ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గడ్డపైనే సభ నిర్వహించడం ద్వారా, బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వానికే నేరుగా రాజకీయ సవాల్ విసరాలన్న స్పష్టమైన సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఈ తాజా వ్యూహంలో ప్రధానంగా రెండు కోణాలు సమాంతరంగా నడుస్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష నేతల నియోజకవర్గాలు అయినప్పటికీ, ఎక్కడా మొండిచెయ్యి చూపకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు కేటాయించడం, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం, పూర్తయిన వాటిని ప్రజలకు అంకితం చేయడం. అదే వేదికలను వేదికలుగా మలచుకుని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరగడం, బీఆర్‌ఎస్ అగ్రనేతల తీరును ఎత్తిచూపుతూ రాబోయే ఎన్నికల పోరుకు ఇప్పటి నుంచే మైదానాన్ని సిద్ధం చేయడం.
అయితే, రేవంత్ రెడ్డి వ్యూహంపై బీఆర్‌ఎస్ పార్టీ కూడా గట్టిగానే స్పందిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం ఈ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, దీనికి కౌంటర్‌గా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, సిరిసిల్ల–సిద్ధిపేట–గజ్వేల్ వర్సెస్ కొడంగల్ అన్నట్లుగా సాగుతున్న ఈ రాజకీయ సవాళ్లు, ప్రతిసవాళ్లు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.




