Off The Record: విజయనగరంలో రెండు శక్తుల సమరం!

Off The Record: చీపురుపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో కళా వెంకటరావు కోడలిపై విజయం సాధించిన బొత్స సత్యనారాయణ కోడలు పూజిత. నియోజకవర్గంలో ఆసక్తికర ఫలితాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 7:58 AM IST
Off The Record
X

Off The Record: విజయనగరంలో రెండు శక్తుల సమరం!

Off The Record: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఇద్దరు నేతలు.. ఒకరు కళా వెంకటరావు, మరొకరు బొత్స సత్యనారాయణ. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకటరావు.. ఏపీ వీసీసీ అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ పనిచేశారు. ఇద్దరికీ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం.. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర.. అనుచరగణం.. రాజకీయ వ్యూహాలు.. ఇవన్నీ ఇద్దరి సొంతం. అయితే ఈసారి జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రం వీరి కుటుంబాల రాజకీయ భవిష్యత్తుకు ఒక పరీక్షగా నిలిచాయి. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. చీపురుపల్లి నియోజకవర్గం.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కళా వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఇక్కడి గరివిడి జెడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీడీపీ తరఫున కళా వెంకటరావు కోడలు కిమిడి సంధ్య బరిలోకి దిగితే.. వైసీపీ తరఫున బొత్స కుటుంబానికి చెందిన పూజిత పోటీ చేశారు. కుటుంబ రాజకీయ వారసత్వం.. పార్టీ బలం.. స్థానిక నాయకత్వం.. ఇలా అనేక అంశాల మధ్య సాగిన పోరులో బొత్స కోడలు పూజిత విజయం సాధించగా.. కళా వెంకటరావు కోడలు సంధ్య ఓటమి పాలయ్యారు‌. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలు ఓటమి పాలవడం కళా వెంకటరావుకు రాజకీయంగా ఎదురుదెబ్బగా చర్చకు వస్తోంది. అయితే ఈ ఒక్క ఫలితంతోనే ఎమ్మెల్యే రాజకీయ బలాన్ని అంచనా వేయలేం. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుటుంబ సభ్యురాలిని గెలిపించుకోవడంలో మాత్రం కళా కుటుంబానికి ఎదురైన ఈ పరాజయం ప్రాధాన్యత సంతరించుకుంది.

గరివిడిలో పూజిత విజయంతో బొత్స కుటుంబం చీపురుపల్లి నియోజకవర్గంలో ఖాతా తెరిస్తే.. గుర్ల జెడ్పీటీసీ ఫలితం కూడా అదే కుటుంబానికి మరో సానుకూల పరిణామంగా నిలిచింది. గుర్ల జెడ్పీటీసీ స్థానంలో బొత్స సత్యనారాయణ సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి విజయం సాధించారు. ఈ విజయంతో చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స కుటుంబం రాజకీయంగా తన ఉనికిని చాటుకుంది. మరోవైపు నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో రెండింటిని వైసీపీ కైవసం చేసుకోవడం కూడా ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామంగా నిలిచింది. ఒకవైపు కళా కుటుంబానికి ఎదురుదెబ్బ.. మరోవైపు బొత్స కుటుంబానికి రెండు విజయాలు.. ఈ పరిణామాలు చీపురుపల్లి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీదారుగా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చిన అనూష.. ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో బొత్స కుటుంబానికి చెందిన కోడలు పూజిత, సోదరి వెంకటలక్ష్మి విజయాలు సాధించడం.. అనూష ఓటమి పాలవడం.. ఈ ఎన్నికల్లో కుటుంబానికి మిశ్రమ ఫలితాలను తీసుకొచ్చింది. అంటే.. ఒకచోట బొత్స కుటుంబానికి ఓటర్లు అండగా నిలిస్తే.. మరోచోట అదే కుటుంబానికి చెందిన అభ్యర్థిని ఓడించారు. కళా వెంకటరావు సొంత నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యురాలు ఓటమి పాలవడం.. బొత్స కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించడం.. ఇవన్నీ స్థానిక రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుతోపాటు అభ్యర్థి వ్యక్తిగత పరిచయాలతో పాటు గ్రామస్థాయి నాయకత్వం, కార్యకర్తల సమన్వయం, స్థానిక సమస్యలు కూడా ప్రభావం చూపే అవకాశముందన్న టాక్ నడుస్తోంది. అయితే జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుల కుటుంబాల ప్రభావం ఎంతవరకు కొనసాగుతోంది.. స్థానిక ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తున్నారు.. అనే అంశాలను మాత్రం ఈ ఎన్నికలు మరోసారి చర్చకు తెచ్చాయి.

దశాబ్దాల రాజకీయ అనుభవం ఒకవైపు.. కుటుంబ రాజకీయ వారసత్వం మరోవైపు.. కుటుంబ వారసత్వం ఉన్నా.. రాజకీయ అనుభవం ఉన్నా.. చివరకు గెలుపోటములను నిర్ణయించేది ఓటరే అన్న సంకేతాలను ఈ ఎన్నికలు మరోసారి చాటుతున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్