Big Story: అగ్నివీరులకు కేంద్రం దీపావళి గిఫ్ట్!

Big Story: అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త తెలిపింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత మరో రెండేళ్ల పొడిగింపునిస్తూ, ఆ తర్వాత అర్హత ఆధారంగా అందరికీ సైన్యంలో చేరే అవకాశం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Nov 2026 12:02 PM IST
Big Story
X

Big Story: అగ్నివీరులకు కేంద్రం దీపావళి గిఫ్ట్!

Big Story: అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అగ్నివీరులు సైన్యంలో భాగస్వాములు కారు.తాత్కాలికంగా సైన్యానికి సేవలందించడమే వారి డ్యూటీ. అయితే దీనికి కాలం చెల్లింది. ఇక నుంచి అగ్నివీరులందరినీ సైన్యంలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే అగ్నివీరుల్లో 25 శాతం మందిని తాత్కాలిక ప్రాతిపదికన కేంద్రం...సైన్యంలోకి తీసుకుంది. కాగా మిగిలిన 75 శాతం మందికి కూడా సైన్యంలో చేరే అవకాశాన్ని కల్పించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా నాలుగేళ్ల పాటు సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు తొలుత రెండేళ్ల పొడిగింపు ఇస్తారు. ఆ తరువాత వారి అర్హతలను పరిగణనలోకి తీసుకుని సైన్యంలో చేరే ఆప్షన్ ను వారికే ఇస్తారు. దీంతో ఆసక్తి ఉన్న అగ్నివీరులు...సైన్యంలో చేరే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

కాగా అగ్నివీరులను సైన్యంలో చేర్చుకోవడానికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కు కొన్ని రోజుల కిందట సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు ఒక సిఫార్సు పంపారు. ఈ సిఫార్సుకు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలియచేసింది.ఈ విషయాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎన్ ఎస్ రాజా సుబ్రమణి వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయన అనేక కీలక విషయాలు తెలియచేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూడు వారాల్లో రిటైర్ కానున్న దాదాపు ఇరవై వేల మంది అగ్నివీరులకు మేలు జరుగుతుంది. వీరందరికీ సైన్యంలో చేరే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం నాలుగేళ్ల తరువాత 25 శాతం మంది అగ్నివీరులను త్రివిధ దళాలు ఎంపిక చేసుకుంటే మిగిలిన 75 శాతం మంది బయటకు వెళ్లాల్సి వచ్చేది.

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి మరో రెండేళ్ల సర్వీసు కొనసాగుతుంది.

కాగా తొలి నాలుగు సంవత్సరాల్లో అగ్నివీరులు ఎంత పొదుపు చేస్తే అంత మొత్తం కేంద్ర ప్రభుత్వం జత చేసి...సేవానిధి కింద జమ చేస్తుంది. సర్వీసు పొడిగించే రెండేళ్లలో అగ్నివీరులు సమకూర్చే మొత్తానికి 70 శాతం అదనంగా జత చేసి సేవా నిధిలో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మొత్తంమీద అగ్నివీరులను ఆర్థికంగా కూడా బలోపేతం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అగ్నిపథ్...2022లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. సైన్యంలో యువతకు నాలుగేళ్లపాటు కొలువులు కల్పించే ఈ పథకాన్ని అట్టహాసంగా కేంద్రం ప్రారంభించింది. పదిహేడు నుంచి ఇరవై ఒక్క ఏళ్ల మధ్య వయసులో ఉన్న కుర్రకారు ఈ పథకానికి అర్హులు. విద్యార్హతలు కూడా పెద్దగా అవసరం లేదు. ఇంటర్మీడియట్ లేదా టెన్త్ పాసయితే చాలు. అగ్నిపథ్ కు సెలెక్ట్ అయిన వాళ్లను వాళ్ల వాళ్ల అర్హతలను బట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ....ఇలా ఎందులోనైనా భర్తీ చేస్తారు.

అయితే అగ్నివీరుల సర్వీసు కేవలం నాలుగుళ్లే అని కేంద్రం అప్పట్లో ప్రకటించింది.ఇదే వివాదంగా మారింది.

మినిమమ్ సర్వీసు 11 నుంచి 17 సంవత్సరాలు ఉండాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. సహజంగా మనదేశంలో చాలా మంది యువకులకు సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉంటుంది. అలాంటివారు, అగ్నిపథ్ పథకంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో అగ్నివీరులకు ఊరట లభించినట్లయింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్