Off The Record: YCPకి కొత్త ఇంచార్జ్.. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు వైసీపీ స్కెచ్!

Off The Record: మంగళగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బుర్రముక్క వేణుగోపాల సోమిరెడ్డిని నియమించారు. మారుతున్న రాజకీయ సమీకరణాలపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Oct 2026 2:18 PM IST
Off The Record
X

Off The Record: YCPకి కొత్త ఇంచార్జ్.. లోకేష్‌కు చెక్ పెట్టేందుకు వైసీపీ స్కెచ్!

Off The Record: ఏపీలో మంగళగిరి నియోజకవర్గం ప్రాధాన్యతే వేరు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మెజార్టీతో నారా లోకేష్‌ను ఎమ్మెల్యే చేసిన నియోజకవర్గం ఇది. గెలిచి మంత్రి అయిన నాటి నుంచి ఈ నియోజకవర్గంపై లోకేష్ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. 2019లో ఓడిన నాటి నుంచీ అక్కడే గెలవాలనే పట్టుదలతో పని చేసి విజయం సాధించారు. ఇక.. మంత్రి అయ్యాక ఈ నియోజకవర్గం తనకు కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అటు వైసీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఇక్కడ బలమైన రాజకీయ వ్యూహాన్ని రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, వైసీపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నిక ల్లో లోకేష్‌ను ఓడించారు. 2024 ఎన్నికల ముందు నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నిర్ణయాలతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. కొద్ది రోజులకే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే, ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు దక్కలేదు. గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకొచ్చారు. కానీ.. సీటు మాత్రం మురుగుడు లావణ్యకు ఆ పార్టీ అధినేత జగన్ ఖరారు చేశారు. దీంతో... ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో లోకేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక.. నియోజకవర్గంలో వైసీపీకి ఇంఛార్జ్‌గా ఎవరిని నియమించాలనే సందిగ్థత ఏర్పడింది. ఆ సమయంలో తొలి నుంచి పార్టీలో ఉంటున్న దొంతిరెడ్డ వేమారెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

కాగా, రెండేళ్లలోనే ముగ్గురు ఇన్‌చార్జులను వైసీపీ మార్చటం పార్టీలో గందరగోళం ఏర్పడింది. అటు లోకేష్ బలమైన నేతగా నియోజకవర్గంలో నిలుస్తున్నారు. ఈ సమయంలో వైసీపీలో వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు కేడర్‌కు అంతు చిక్కటం లేదట. అటు రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు అండ్ కో పై ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం చేశారు. పార్టీ వ్యవహారాల్లోనూ చురుకుగా వ్యవహరించారు. అయితే.. 2024 ఎన్నికల ముందు ఆయన్ను పక్కన పెట్టి నాడు చేనేత వర్గానికి అవకాశం కల్పించారు. ఎన్నికల్లో ఓటమి తరువాత లావణ్య పార్టీకి దూరంగానే ఉంటున్నారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు మాత్రం ఎమ్మెల్సీగా వైసీపీలో కొనసాగుతున్నారు.

ఇక, దొంతిరెడ్డి వేమారెడ్డి వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్న సమయంలో కొత్త చర్చ మొదలైంది. వయో భారం కారణంగా వేమారెడ్డి యాక్టివ్‌గా ఉండటం లేదని... లోకేష్‌ను ఢీకొట్టే సమర్ధమైన నేత కావాలనే చర్చ మొదలైంది. దీంతో... ఇప్పుడు అధిష్టానం వేమారెడ్డిని పక్కన పెట్టి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని ఇంఛార్జ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానికుడు కావడంతోనే ఇతన్ని రంగంలోకి దించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే వేణుగోపాల సోమిరెడ్డి ఆధ్వర్యంలోనే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్కేకి సన్నిహితుడిగా కొనసాగిన బుర్రముక్కకి.. ఏకంగా నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి దక్కడంపై స్థానికుల్లోనూ చర్చ మొదలైంది.

ఎన్నికల తర్వాత మంగళగిరిపై లోకేష్‌ మరింత దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యకలాపాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్నది వైసీపీకి కీలకమైన అంశంగా మారింది. ఈ సమయంలో మంగళగిరిలో ఆయన్ను బుర్రముక్క ఏ స్థాయిలో ఢీ కొంటారో అనే చర్చ సాగుతోంది. ఇటు వైసీపీలో కొనసాగుతున్న పరిణామాలు టీడీపీకి వరంగా మారుతున్నాయి. వరుసగా ఇంఛార్జ్‌లను మార్పు చేయటం.. కేడర్ ను పట్టించుకోకపోవటం వంటివి మైనస్‌గా మారుతున్నాయి. అయితే.. ఇప్పుడు నియమించిన బుర్రముక్క ఎన్నికల వరకు ఇంఛార్జ్‌గా కొనసాగుతారా.. మరో నేత రంగంలోకి దిగుతారా అనే చర్చా వినిపిస్తోంది.

జగన్ నివాసం ఉండే ఈ నియోజకవర్గం విషయంలో తాజా నిర్ణయాలు వైసీపీలో గందరగోళానికి కారణం అవుతున్నాయి. మరి... జగన్ ప్రస్తుత ఇంఛార్జ్ పైన జరుగుతున్న చర్చతో భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్