Off The Record: కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు!

Off The Record: తెలంగాణలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం లెఫ్ట్ పార్టీల మద్దతు కోరుతున్న బీఆర్ఎస్. సీపీఎం, సీపీఐతో గులాబీ నేతల చర్చలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2026 7:57 AM IST
Off The Record
X

Off The Record: కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు!

Off The Record: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. అప్పట్లో సీపీఎం చాలా స్థానాల్లో గులాబీ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ లెఫ్ట్ పార్టీలు సహకరించాయి. కానీ సీపీఐ మాత్రం వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే నిలిచింది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నిక రాజకీయాలను పూర్తిగా మార్చివేసింది. ఆ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ రెండు పార్టీలూ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి. ఆ లెఫ్ట్ బలమే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

మునుగోడు సక్సెస్ తర్వాత లెఫ్ట్, బీఆర్ఎస్ పొత్తు కంటిన్యూ అవుతుందని అందరూ భావించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగింది. దీంతో సీపీఐ మళ్లీ కాంగ్రెస్‌తో జతకట్టగా, సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు లెఫ్ట్ పార్టీల మద్దతు ఉంటే బాగుంటుందని బీఆర్ఎస్ భావిస్తోందట. త్వరలో రానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో లెఫ్ట్ పార్టీల సపోర్ట్ కోరాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే సీపీఎం నేతలతో పల్లా చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీ కమిటీలో చర్చించి తమ నిర్ణయం చెబుతామని సీపీఎం నేతలు స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

మరోవైపు సీపీఐ ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది. అయితే, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించడంపై సీపీఐ గుర్రుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ పునరాలోచనలో పడిందంటున్నారు. మరి ఈ నేపథ్యంలో సీపీఐ చివరికి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుందా..? లేక తటస్థంగా ఉంటుందా..? అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్... లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకునిపోతే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చని గట్టిగా నమ్ముతోందట. కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలని లెఫ్ట్ పార్టీలను గులాబీ అగ్రనేతలు కోరుతున్నట్టు సమాచారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా లెఫ్ట్ పార్టీలను తన వైపు తిప్పుకోవడంలో బీఆర్ఎస్ వేస్తున్న ఈ ఎత్తుగడ ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది.. ? సీపీఎం, సీపీఐ పార్టీలు గులాబీ బాట పడతాయా..? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఈ పొత్తు ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందనేది చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్