Burning Topic: హోరాహోరీగా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు!

Burning Topic: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో ఫ్లావియో బొల్సొనారో ముందంజలో నిలిచారు. స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్టోబర్ 25న రెండో విడత ఎన్నికలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Oct 2026 7:43 AM IST
Burning Topic
X

Burning Topic: హోరాహోరీగా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు!

Burning Topic: దక్షిణ అమెరికా ఖండంలోని అతిపెద్ద దేశం బ్రెజిల్‌లో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. అక్టోబర్ 4, 2026న జరిగిన మొదటి విడత పోలింగ్‌ ముగిసింది. మొదటి విడత ఎన్నికలలో ప్రధానంగా ప్రస్తుత అధ్యక్షుడు వర్కర్స్ పార్టీ అభ్యర్థి లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా, మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో తనయుడు లిబరల్ పార్టీ అభ్యర్థి ఫ్లావియో బొల్సొనారో మధ్య హోరాహోరీ పోరు సాగింది.ఫ్లావియో బొల్సొనారో 56,104,503 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా 53,879,538 ఓట్లు పొందారు. కాగా

ఫ్లావియో కు 47.03% ఓట్లు, లులాకు 45.16% ఓట్లు రాగా ఇతర అభ్యర్థులు అగస్టో కురి 2.89%, రేనన్ శాంటోస్ 2.24%, రొనాల్డో కయాడో 2.18% పొందారు. అయితే ఏ అభ్యర్థికీ స్పష్టమైన మెజారిటీ అంటే 50% పైగా ఓట్లు రాకపోవడంతో ఈ ఎన్నికలు ఇప్పుడు రెండో విడత దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 25న రెండో విడత పోలింగ్ జరగనున్నట్లు దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది.

వామపక్ష యోధుడు వర్కర్స్ పార్టీ అభ్యర్థి 80 ఏళ్ల లూలా డి సిల్వా వరుసగా కాకున్నా, ఇప్పటికే మూడు సార్లు దేశ అధ్యక్షునిగా పని చేశారు. నాలుగోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాగా ఎన్నికల సర్వేలు మొదట్లో లులా డా సిల్వాకు స్వల్ప ఆధిక్యం ఉంటాయని అంచనా వేసినప్పటికీ, ఫ్లావియో బొల్సొనారో అనూహ్యంగా పుంజుకుని ఆధిక్యం సాధించారు. బ్రెజిల్‌లో నిరుద్యోగిత తగ్గినప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం, అధిక గృహ రుణాలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సాధారణ ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. లూలా ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వ్యవస్థపై ఉన్న అసంతృప్తి వ్యతిరేకంగా ఓట్లు పడటానికి కారణమైందని భావిస్తున్నారు. ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంలో ఫ్లావియో బొల్సొనారో విజయవంతమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్న బొల్సొనారో హామీలు ఓటర్లను ఆకర్షించాయి.

కాగా లిబరల్ పార్టీ అభ్యర్థి ఫ్లావియో బొల్సొనారో ప్రస్తుతం ఫెడరల్ సెనేటర్ గా పనిచేస్తున్నారు. ఆయన 2019 నుండి రియో డి జనీరో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఆయన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో పెద్ద కుమారుడు. 2022 అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా చేతిలో జైర్ బొల్సొనారో ఓడిపోరు. అయితే అధ్యక్ష పీఠాన్ని వదులుకోడానికి అంగీకరించలేదు. ఆయన బొల్సొనారో అధికార పీఠాన్ని వదులుకోకుండా ఉండేందుకు సైనిక తిరుగుబాటుకు కుట్ర పన్నారని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు, ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో బ్రెజిల్ సుప్రీంకోర్టు జైర్ బొల్సొనారోకు 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష కూడా విధించింది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు బాసటగా నిలిచారు. ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో జైర్ బొల్సొనారో తనయుడు ఫ్లావియో బొల్సొనారో అధిక్యత ప్రదర్శించడం సహజంగానే ట్రంప్‌కు ఆనందం కలిగించింది. (Jair Bolsonaro)

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరినా ఆశ్యర్యపరచింది. ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో.. 125 మిలియన్ల మంది ఈరోజు ఇండియాలో అధ్యక్ష ఎన్నికల తొలి దశలో ఓటేశారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలు వచ్చాయి అని రాశారు. వాస్తవానికి జరిగింది బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు అసలు భారత్‌లో అధ్యక్ష పదవికి నేరుగా ప్రజలచే ఎన్నికలు జరగవు. ట్రంప్‌ బ్రెజిల్‌ ఎన్నికల గణాంకాలను భారత్‌కు ఆపాదిస్తూ ట్రంప్‌ పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.భారత్‌ ఎన్నికలను ప్రస్తావించిన ట్రంప్‌.. ఇదే పోస్టులో అమెరికా ఎన్నికల వ్యవస్థపైనా విమర్శలు చేశారు. డెట్రాయిట్‌, ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు వారాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ‘‘వోటింగ్‌ ఇన్‌ అమెరికా ఈజ్‌ కరప్ట్‌’’ అంటూ ఆరోపించారు. పొంతన లేకుండా భారత్ ప్రస్థావన తేవడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా తాజా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో, లూలా డి సిల్వా మధ్య 2022లో జరిగిన పోరాటాన్ని తలపిస్తున్నాయి. దేశ ప్రజలు స్పష్టంగా రెండు భిన్నమైన సిద్ధాంతాల వైపు చీలిపోయారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఫ్లావియో బొల్సొనారో తాను గెలిసిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌తో మెరుగైన సంబంధాలు నెరుపుతానని ప్రకటించారు. అదే జరిగితే లాటిన్‌ అమెరికాలో అమెరికా ప్రభావం పెరిగే అవకాశముంది. లూలా డి సిల్వా మరోసారి గెలిస్తే వాషింగ్టన్‌కు దూరంగా ఉంటూ చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా బ్రెజిల్‌ ముందుకు సాగనుంది. బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని నాలుగోసారి దక్కించుకోవాలని చూస్తున్న లులా, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ పథకాలే ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మలి విడత పోలింగ్ నాటికి ఇదే ఊపును కొనసాగించి విజయం నమోదు చేయాలని ఫ్లావియో కోరుకుంటున్నారు

లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌లో 21.4 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. బ్రెజిల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వర్కర్స్‌ పార్టీ శకం ముగిసింది అని కొందరు విశ్లేషకులు అంటున్నారు కాగా తొలి విడతలోనే విజయం సాధిస్తానని భావించిన తనకు ఈ ఫలితం ఊహించనిదని లులా అంటున్నారు. రెండో విడతలో గెలవడానికి గట్టి పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. రేపటి నుంచి కొత్త ప్రచారం మొదలుపెడతాం. నాకౌట్‌ దశలో నేను చాలా బాగా ఆడతాను. ఎవరి ప్రణాళిక మెరుగైనదో చూద్దాం అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు విస్తృత ప్రజాదరణ పొందిన లూలా మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు మద్దతు తగ్గింది. అయితే అమెరికాను ఎదుర్కొంటూ వ్యవహరించిన తీరు ఆయనకు కొంత ఊరటనిచ్చింది. సామాజిక సంక్షేమ పథకాల వల్ల లక్షలాది బ్రెజిల్‌ ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయని భావించే వర్గాలు ఇప్పటికీ ఆయనకు మద్దతుగా ఉన్నాయి. అక్టోబర్ 25న జరగబోయే రన్ ఆఫ్ పోలింగ్ బ్రెజిల్ భవిష్యత్తును నిర్ణయించనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్