Off The Record: తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ వ్యూహం అదేనా?
Off The Record: తెలంగాణలో వరుస ఎన్నికల వేళ బీజేపీ హైకమాండ్ ఫోకస్. కొత్త టీమ్‌తో అమిత్ షా భేటీ ఉంటుందన్న ప్రచారం రాజకీయ వర్గాలలో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
Off The Record: తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ వ్యూహం అదేనా?
Off The Record: తెలంగాణపై మళ్లీ ఢిల్లీ బీజేపీ పెద్దల ఫోకస్ పెరిగిందా..? ఇటీవల నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన, కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు జోరుగా సాగాయి. నిన్న గాక మొన్న రాష్ట్ర పార్టీకి కొత్త సంస్థాగత కూర్పు పూర్తయింది. సునీల్ బన్సల్ తెలంగాణ ఇన్‌చార్జిగా.. అభయ్ పాటిల్, రేఖా శర్మ సహ ఇన్‌చార్జులుగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా సంస్థాగత విభాగంలో మధుకర్ ప్రధాన కార్యదర్శిగా, దశరథ్ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అంటే టీమ్ కొత్తది. టార్గెట్లు కొత్తవి. ముందున్న రాజకీయ సవాళ్లు మాత్రం పెద్దవే. ఇలాంటి సమయంలో అమిత్ షా తెలంగాణకు వస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోందట.
అక్టోబర్ 4న కరీంనగర్‌లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. కానీ.. అసలు ఆసక్తి కార్యక్రమంలో కాదు.. అదే సమయంలో పార్టీ ఆఫీస్ బేరర్లతోపాటు కొత్త టీంతో సమావేశం ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోంది. ఇంతకీ పార్టీ నేతలతో మీటింగ్ ఉంటుందా..? లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్. ఎందుకంటే.. కొత్త టీంతో అమిత్ షా భేటీ అయితే.. “ఆట మొదలైందన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు వెళ్లే అవకాశం స్పష్టంగా కన్పిస్తోందట.
తెలంగాణ బీజేపీకి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఒక్కటే కాదు.. ముందు అనేక రాజకీయ సవాళ్ళతో...బీజేపీకి వరుస అగ్ని పరీక్షలే కనిపిస్తున్నాయి. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మహబుబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు... అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్ల ఎన్నికలు, ఇక ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలు. ఒక్క ఎన్నిక ముగిసేలోపే మరో ఎన్నిక తలుపు తట్టే పరిస్థితి. వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ సంస్థాగత వ్యవస్థను పటిష్టం చేయడంపై కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఆదివారం పార్టీ నేతలతో అమిత్ షా భేటీ జరిగితే.. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏంటి..? కేడర్ ఎలా ఉంది..? బూత్ కమిటీలు ఎంతవరకు యాక్టివ్‌గా ఉన్నాయి..? ఎక్కడ బలం ఉంది..? ఎక్కడ బలహీనత ఉంది..?
ఎవరిని బరిలోకి దించాలి..? ఎవరికి బాధ్యతలు అప్పగించాలి..? ఏ సామాజిక సమీకరణంతో ముందుకు వెళ్లాలి..? బూత్ స్థాయిలో కేడర్‌ను ఎలా కదిలించాలి..? ఇలాంటి అంశాలపై రాష్ట్ర నేతల నుంచి నివేదికలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌పై ప్రత్యేక ఫోకస్ ఉంటుందా..? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎన్నికల యుద్ధంలో అభ్యర్థి ఒక్కరే కాదు.. అభ్యర్థి వెనుక నిలబడే యంత్రాంగం కూడా కీలకమే. అందుకే బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయంపై కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం. అమిత్ షా తెలంగాణ పర్యటనపై గతంలో చర్చ జరిగినా.. అప్పట్లో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ ఉద్యమంతో పాటు పలు కారణాలతో షెడ్యూల్‌లో మార్పులు వచ్చాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ టూర్‌పై కదలిక కనిపిస్తుండటంతో.. రాష్ట్ర బీజేపీలో చర్చ మొదలైంది. ఖైరతాబాద్ బైపోల్, ఎమ్మెల్సీ ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికలు.. మూడు ఫ్రంట్‌లలో ఒకేసారి పోరాటానికి పార్టీని సిద్ధం చేయడమే టార్గెట్టా..? అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల నిర్వహణ వరకు.. బాధ్యతలు ఎవరికీ..?
సమన్వయం ఎవరి చేతిలో..? పట్టణ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత బలం పెంచడం, యువతను ఆకర్షించడం, కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయడం. ఇదే ఇప్పుడు పార్టీలో అసలు చర్చ. అయితే.. ఇవన్నీ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలే. అక్టోబర్ 4 పర్యటన, ఆఫీస్ బేరర్ల సమావేశంపై అధికారిక షెడ్యూల్ వెలువడితేనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నదే ఆసక్తికరంగా మారాయట.
అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. అమిత్ షా వస్తే.. కేవలం కార్యక్రమానికే వస్తారా..? లేక తెలంగాణ బీజేపీ పొలిటికల్ గేమ్‌కు కొత్త స్కెచ్ గీస్తారా..? ఎవరి చేతిలో ఏ బాధ్యత పడుతుంది..? ఎన్నికల చదరంగంలో పావులు కదలడం మొదలైందా..? లేక అసలు ఆటగాళ్లు ఇంకా తెర వెనుకే ఉన్నారా..? అక్టోబర్ 4న జరిగే మీటింగ్‌లో ఏం డిసైడ్ అవుతుంది..? అమిత్ షా టూర్ ఎలాంటి రాజకీయ వేడి రగిలిస్తుంది..? అన్నది చూడాలి మరి.




