OFF THE RECORD: కాంగ్రెస్ లో కల్లోలం.. గురు శిష్యుల మధ్య రాజకీయ యుద్ధం!
OFF THE RECORD: కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు.
OFF THE RECORD: కాంగ్రెస్ లో కల్లోలం.. గురు శిష్యుల మధ్య రాజకీయ యుద్ధం!
OFF THE RECORD: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకు కేంద్ర బిందువుగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు బీఆర్ఎస్లో కలిసి పనిచేసిన నేతలే ఇప్పుడు కాంగ్రెస్‌లో పరస్పరం కత్తులు దూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోందని స్థానిక నేతలు చెబుతున్నారు. బాన్సువాడ కాంగ్రెస్‌లో ప్రస్తుతం మూడు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. పోచారం వర్గం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు వర్గం, మరో స్థానిక నాయకుల వర్గం. దీంతో పార్టీ కేడర్ సైతం రెండు ముక్కలైందని అంటున్నారు. పాత కాంగ్రెస్ నాయకులు ఒకవైపు.. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మరోవైపు నిలిచారని చర్చ జరుగుతోంది.
ఇటీవల నామినేటెడ్ పదవుల భర్తీ అంశం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసిందని చెబుతున్నారు. అధిష్టానం 70 శాతం పదవులు పాత కాంగ్రెస్ నేతలకు, 30 శాతం పదవులు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలని భావించినా, అమలులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఏనుగు వర్గం ఆరోపిస్తోంది. ప్రత్యేకించి సొసైటీ చైర్మన్ల నియామకాల్లో తమ వర్గానికి అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తమకు రావాల్సిన అవకాశాలను ఇతరులకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారట. ఈ వ్యవహారంపై ఎంపీ సురేష్ షెట్కార్ జోక్యం చేసుకోవాలని కోరినప్పటికీ, ఆయన పోచారం వర్గానికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన ఏనుగు అనుచరుల్లో బలపడిందని సమాచారం. ఇదే అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని భావించామని, కానీ ప్రస్తుతం పరిస్థితి వ్యతిరేకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజార్టీ తెచ్చిపెట్టినా, ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారానికీ ఏనుగు రవీందర్‌రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్తున్నారనే ప్రచారాన్ని ఖండిస్తూ.. "నేను ఎక్కడికీ వెళ్లను.. కాంగ్రెస్‌లోనే ఉంటాను.. బాన్సువాడ నుంచే పోటీ చేస్తాను" అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడిందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రకటనతో బాన్సువాడ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ప్రశ్న ఇప్పటి నుంచే తెరపైకి వచ్చింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. మరోవైపు ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా తాను వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు ఇస్తున్నారు. నిజానికి ఈ ఇద్దరు నేతల రాజకీయ ప్రయాణంలో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఏనుగు రవీందర్‌రెడ్డి బరిలో దిగారు. అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో పోచారం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అప్పటినుంచే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, అనుచర వర్గాలు మాత్రం పూర్తిగా రెండు శిబిరాలుగా విడిపోయాయని తెలుస్తోంది. ఒకరి సమావేశాలకు మరొకరు దూరంగా ఉండటం, పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోవడం కామన్ అయిపోయిందట. కొన్ని సందర్భాల్లో నాయకుల అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదాలు కూడా చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. ఇటీవల వరకు రాజకీయంగా కాస్త సైలెంట్‌గా కనిపించిన ఏనుగు రవీందర్‌రెడ్డి.. మళ్లీ యాక్టివ్ కావడం కూడా చర్చకు కారణమైంది. వరుసగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్‌ను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తాను బాన్సువాడ రాజకీయాల నుంచే తన భవిష్యత్తును కొనసాగిస్తానని స్పష్టం చేస్తున్నారు. ఇక పోచారం వర్గం మాత్రం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీ బలోపేతమే తమ లక్ష్యమని, అధిష్టానం సూచించిన విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతున్నారట. అయితే అంతర్గతంగా మాత్రం ఈ వివాదాలు అధిష్టాన దృష్టికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరుకున్న ఈ వ్యవహారం.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అభ్యర్థిత్వంపై ఇప్పటినుంచే జరుగుతున్న పోరాటం.. పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి కారణమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాన్సువాడలో కాంగ్రెస్ బలపడాలంటే రెండు వర్గాల మధ్య సమన్వయం అవసరమని స్థానిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఆ దిశగా అడుగులు పడుతున్నాయా..? లేక విభేదాలు మరింత ముదురుతున్నాయా..? అన్న చర్చ సాగుతోంది.




