Off The Record: బండి సంజయ్‌కు తెలంగాణలో కీలక పదవి!

Off The Record: తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు హైకమాండ్ వ్యూహం సిద్ధం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 11:06 AM IST
Off The Record
X

Off The Record: బండి సంజయ్‌కు తెలంగాణలో కీలక పదవి!

Off The Record: కాషాయ దళంలో జోష్ తగ్గకూడదు.. గ్రౌండ్‌లో జెండా రెపరెపలాడాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ఎక్కడా ఆగకూడదు.. ఈ ఉద్దేశంతోనే బీజేపీ హైకమాండ్ రెండు ట్రాక్‌లలో దూసుకెళ్లేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. హిందుత్వ ఫైర్‌బ్రాండ్‌గా, మాస్ లీడర్‌గా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని నడిపించిన బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. దసరా పండుగ సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది.

గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1,500 కిలోమీటర్ల 'ప్రజా సంగ్రామ యాత్ర'తో పార్టీకి భారీ మైలేజ్ తెచ్చిపెట్టిన బండి చేత, మరోసారి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయించే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 4 వరకు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో తెలంగాణలో బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపించింది.

దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల విజయాలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏకంగా 48 డివిజన్లు గెలుచుకుని అధికార పార్టీకి షాక్ ఇవ్వడం వెనుక ఆనాడు బండి ప్రచార శైలే ప్రధాన కారణం. మునుగోడు, నాగార్జునసాగర్ వంటి చోట్ల ఎదురుదెబ్బలు తగిలినా.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అనే ఇమేజ్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బండి సఫలమయ్యారు.

ఇక తాజాగా 2026లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలిసారిగా మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కమలం పార్టీ దక్కించుకోవడం బండి రాజకీయ ప్రభావాన్ని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన అనుభవాన్ని, మాస్ ఇమేజ్‌ను ఎన్నికల ప్రచారానికి పూర్తిస్థాయిలో వాడుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. బండికి బాధ్యత ఇవ్వడంతో పాటు, మొత్తం తెలంగాణ బీజేపీని రీచార్జ్ చేసే పనిలో ఢిల్లీ పెద్దలు ఉన్నారు.

పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఐదుగురితో కూడిన కొత్త నాయకత్వ వ్యవస్థ రంగంలోకి దిగింది. పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా సునీల్ బన్సల్, సహ ఇంచార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ, రాష్ట్ర సంస్థాగత ఇంచార్జీ మధుకర్, సహ ఇంచార్జి దశరథ్ బాధ్యతలు చేపట్టారు. పదవులు షోకోసం కాదు, పనిచేయడానికే అనే కఠిన సందేశాన్ని హైకమాండ్ నేతలకు ఇస్తోంది. ఫీల్డ్‌లోకి రాని వాళ్లకు, కష్టంలో కార్యకర్త పక్కన నిలబడని వాళ్లకు పదవులతో ప్రయోజనం లేదనే స్పష్టత ఇచ్చేశారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో వరుస ఎన్నికలు బీజేపీకి పెద్ద టెస్ట్ లాంటివి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలో "ఇంటింటికీ పార్టీ.. గడపగడపకూ గళం" అనే నినాదంతో గ్రౌండ్ లెవెల్ యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోంది.

బూత్ కమిటీల నుంచి సోషల్ మీడియా వారియర్స్ వరకు ప్రతి ఒక్కరినీ యాక్టివ్ చేయాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాదు, గ్రౌండ్‌లో జరిగిన పోరాటాన్ని జనాల్లోకి తీసుకెళ్లడమే కొత్త స్ట్రాటజీ. ఇటువంటి కీలక తరుణంలో బండి సంజయ్‌కు ప్రచార పగ్గాలు అప్పగిస్తే.. కేడర్‌కు కమాండ్, కార్యకర్తలకు కిక్, ప్రత్యర్థులకు రాజకీయ వేడి ఒకేసారి తాకడం ఖాయమని కమల దళం గట్టిగా నమ్ముతోంది.

బండి సంజయ్ మళ్లీ ప్రచార బరిలోకి దిగితే.. తెలంగాణ పాలిటిక్స్‌లో పొలిటికల్ హీట్ పెరగడం ఖాయం. ఎందుకంటే.. రాజకీయాల్లో పంచ్ పడితే వార్త అవుతుంది. కానీ బండి లాంటి మాస్ లీడర్ రంగంలోకి దిగితే.. అదే పంచ్ పొలిటికల్ పంచ్‌గా మారుతుంది. ఇప్పుడు అందరి చూపు.. ఆ ప్రకటనపైనే! బండి రీ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..?

లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా..? అన్నది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారింది. మరి దసరా నాటికి రాబోయే ఆ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించనుంది..? బండి రీఎంట్రీతో కమలం శ్రేణుల్లో ఎలాంటి జోష్ రాబోతుంది..? ఈ ప్రశ్నలకు క్లారిటీ కావాలంటే పండుగ వరకు ఆగాల్సిందే మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్