Off The Record: రూటు మార్చిన ఏపీ రూలింగ్ పార్ట్‌నర్..!‘స్థానిక’ వ్యూహం ఫలించేనా?
Off The Record: ఏపీలో స్థానిక ఎన్నికల లక్ష్యంగా బీజేపీ అక్టోబర్ 7 నుంచి 175 నియోజకవర్గాల్లో 'సేవా జ్యోతి యాత్ర' నిర్వహించనుంది.
Off The Record: రూటు మార్చిన ఏపీ రూలింగ్ పార్ట్‌నర్..!‘స్థానిక’ వ్యూహం ఫలించేనా?
Off The Record: ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాల విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత పరిస్థితిని అంచనా వేయడం.. జిల్లా నుంచి మండలం, గ్రామస్థాయి వరకు పార్టీ బలాన్ని గుర్తించడం.. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం.. ఇదే తదుపరి కార్యాచరణగా సమావేశంలో స్పష్టత ఇచ్చారు ఏపీ బీజేపీ అగ్రనాయకులు.
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూనే.. బీజేపీకి ఉన్న సొంత బలాన్ని కూడా కాపాడుకోవాలన్నది పార్టీ నాయకత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎక్కడ బీజేపీ బలంగా ఉంది..? ఎక్కడ మిత్రపక్షాలకు బలం ఉంది..? స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అన్న దానిపై జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు పూర్తి స్థాయిలో అంచనా వేయాలని కమలదళం ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ సూచించారు.
కూటమి అంటే సర్దుకుపోవడమే కాదు.. సమన్వయంతో కలిసి పనిచేస్తూనే.. బీజేపీ ప్రయోజనాలను కూడా కాపాడుకోవాలన్న సంకేతాలను సమావేశం ఇచ్చింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలి. కానీ పార్టీకి ఉన్న బలాన్ని వదులుకోకూడదు. ఎక్కడ పార్టీకి బలం ఉందో అక్కడ గౌరవప్రదమైన స్థానాలు సాధించేలా ప్రయత్నించాలి.
అదే సమయంలో మిత్రపక్షాల అభ్యర్థుల విజయానికి కూడా కట్టుబడి పనిచేయాలి. అందుకే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? ఎక్కడ పోటీ చేయాలి..? అన్న అంశాన్ని స్థానిక బలాబలాల ఆధారంగా త్వరలో నిర్ణయించనున్నారు. సీట్ల సంఖ్య కంటే.. పార్టీకి ఉన్న బలానికి తగ్గట్టుగా గౌరవప్రదమైన ప్రాతినిధ్యం సాధించడంపైనే బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఎన్నికల సమన్వయంతో పాటు.. పార్టీ సంస్థాగత బలం పెంచుకోవడంపైనా బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంటున్నారు. ప్రతి మండలం.. ప్రతి గ్రామంలో పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా.. నిరంతరం ప్రజల్లో పార్టీ కార్యకర్తలు ఉండేలా కార్యాచరణ ఉండాలి.
రాష్ట్ర స్థాయి నాయకులు, ఇన్‌చార్జులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి. అంటే.. కూటమితో కలిసి ముందుకు వెళ్లడం ఒక వైపు అయితే.. అదే సమయంలో బీజేపీ తన సొంత కేడర్‌ను, బలాన్ని పెంచుకుంటూ.. మిత్రపక్షాలతో సమన్వయంతో ఉండాలి. స్థానిక ఎన్నికలను ఈ రెండు లక్ష్యాలకు వేదికగా ఉపయోగించుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇప్పటికే సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న బీజేపీ.. ఇక సేవా జ్యోతి యాత్రతో మరింత విస్తృతంగా ప్రజలను కలవాలని నిర్ణయించింది. అక్టోబర్ 7 నుంచి 175 నియోజకవర్గాల్లో సేవా జ్యోతి యాత్ర నిర్వహించి.. అక్టోబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ముగింపు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించడంతో పాటు.. పోలవరం, రైల్వే జోన్, జాతీయ రహదారులు, అమరావతి నిర్మాణాలు, పర్యాటక రంగం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అంటే.. ఒకవైపు ఎన్నికల కోసం సంస్థాగతంగా సిద్ధమవుతూనే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించే రాజకీయ కార్యాచరణను కూడా కొనసాగించనుంది.
ఏపీ బీజేపీకి ఇప్పటి వరకు ఒక దశ.. ఇక నుంచి మరో దశ. ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలను విస్తరించడం.. నేతలు, కార్యకర్తలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం.. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇక స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ బలాన్ని ఎన్నికల కార్యాచరణగా మార్చాలని నిర్ణయించింది. కూటమి సమన్వయానికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. అదే సమయంలో బీజేపీకి నష్టం జరగకుండా స్థానికంగా ఉన్న బలాన్ని ఉపయోగించుకోవాలి.
మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తూనే.. పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు సాధించాలి. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూనే.. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో బీజేపీ సొంత బలం పెరిగేలా చూడాలి. అంటే.. కూటమి కోసం సమన్వయం.. పార్టీ కోసం సంస్థాగత విస్తరణ.. ఎన్నికల కోసం క్షేత్రస్థాయి కార్యాచరణ.. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీ దశ–దిశ. మరి.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలించనుందో చూడాలి.




