Off The Record: అన్నమయ్య జిల్లా జడ్పీ టిక్కెట్ కోసం సీనియర్ల పోటీ!

Off The Record: అన్నమయ్య జడ్పీ చైర్మన్ పదవి కోసం సుగవాసి ప్రసాద్‌బాబు, గడికోట ద్వారకనాథరెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Oct 2026 8:16 AM IST
Off The Record
X

Off The Record: అన్నమయ్య జిల్లా జడ్పీ టిక్కెట్ కోసం సీనియర్ల పోటీ!

Off The Record: అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం టీడీపీలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సుగవాసి ప్రసాద్‌బాబు. పార్టీతో దాదాపు నలభై ఏళ్ల అనుబంధం కలిగిన ఆయన ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల నేతలతో సత్సంబంధాలు కొనసాగించడం ఆయనకు ప్లస్‌గా మారిందనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రాజకీయ పరిణామాల్లో ప్రసాద్‌బాబుకు మరింత ప్రాధాన్యత పెరిగిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన సోదరుడు సుగవాసి బాలసుబ్రమణ్యం వైసీపీలోకి వెళ్లినా, తాను మాత్రం టీడీపీనే అంటిపెట్టుకుని ఉండటం అధిష్టానం దృష్టిలో సానుకూల అంశమైందని భావిస్తున్నారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సాన్నిహిత్యం పెరగడం కూడా తన అవకాశాలను బలోపేతం చేస్తోందని ఆయన వర్గం అంచనా వేస్తోంది.

అంతేకాదు, గతంలో విభేదాలు ఉన్నట్లు చెప్పుకునే మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కూడా ఇప్పుడు సఖ్యత నెలకొన్నట్లు ప్రచారం ఉంది. జిల్లా రాజకీయాల్లోని కీలక నేతలందరితో సమన్వయం పెంచుకోవడం ద్వారా జడ్పీ చైర్మన్ రేసులో తాను ముందంజలో ఉన్నాననే సంకేతాలు ప్రసాద్‌బాబు శిబిరం ఇస్తోంది.

అయితే ఈ పోటీ అంత తేలికగా ముగిసేలా కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ టికెట్ విషయంలో పార్టీ కోసం త్యాగం చేశానని భావిస్తున్న ఆయన.. ఇప్పుడు జడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

తన రాజకీయ పరిచయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం కలిగిన నేతల ద్వారా తన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. పార్టీ కోసం చేసిన సేవలు, త్యాగాలను పరిగణనలోకి తీసుకుని అవకాశం కల్పించాలని ఆయన వర్గం కోరుతోందట.

ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. జడ్పీ చైర్మన్ పదవిని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరు నాయకులు ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే పదవిపై ఆశలు పెట్టుకోవడంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది.

అధిష్టానం పార్టీ విధేయతకు ప్రాధాన్యమిస్తుందా..? లేక రాజకీయ త్యాగాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా..? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కూటమి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటివరకు చర్చలో లేని మరో కొత్త పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జిల్లా పరిషత్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అనేక రాజకీయ సమీకరణాలు తెర వెనుక సాగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చివరి నిమిషంలో సమీకరణాలు మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తానికి అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం ఇప్పుడు టీడీపీలో అంతర్గత రాజకీయాలకు అద్దం పట్టే అంశంగా మారింది. సుగవాసి ప్రసాద్‌బాబుకు పార్టీ విధేయత అండగా నిలుస్తుందా..? గడికోట ద్వారకనాథరెడ్డికి రాజకీయ త్యాగం ఫలిస్తుందా..? లేక కూటమి సమీకరణాల నేపథ్యంలో కొత్త అభ్యర్థి ముందుకు వస్తారా..? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో జడ్పీ చైర్మన్ పీఠం చుట్టూనే చర్చ అంతా తిరుగుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్