Off The Record: తెలంగాణ రాజకీయాల్లోకి అమిత్ షా ఎంట్రీ!
Off The Record: హైదరాబాద్‌లో నవంబర్ 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో బీజేపీ 'లోక్తంత్ర బచావో - అరాచకత్వ హటావో' భారీ పాదయాత్ర నిర్వహించనుంది.
Off The Record: తెలంగాణ రాజకీయాల్లోకి అమిత్ షా ఎంట్రీ!
Off The Record: హైదరాబాద్‌లో రాజకీయ రణరంగానికి రంగం సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరానికి రాబోతున్నారు. నవంబర్ 2న సాయంత్రం 3 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు భారీ పాదయాత్ర.. అనంతరం ఎంజే మార్కెట్ వద్ద బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ యాత్రకు లోక్తంత్ర బచావో – అరాచకత్వ హటావో అని పేరు పెట్టిన బీజేపీ.. జనసమీకరణను మాత్రం ఆషామాషీగా తీసుకోవడం లేదు.
ఏకంగా లక్ష మంది జనాన్ని తరలించాలన్నది టార్గెట్. గ్రేటర్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 20వేల మందితో భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్లాన్ సిద్ధం చేసిందట. కేవలం పార్టీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలే కాదు.. మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు, జెన్ జీ యువతను కూడా యాత్రలో భాగస్వామ్యం చేయాలని చూస్తోందట. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. లక్ష మందిని రోడ్ల మీదకు తీసుకొచ్చి బీజేపీ ఏం చెప్పబోతోంది? ఇది కేవలం పాదయాత్రనా?
లేక తెలంగాణలో తమ రాజకీయ బలాన్ని కొలిచే అగ్నిపరీక్షనా? మొత్తానికి జనముంటేనే బలమని భావిస్తున్న కమలనాథులు.. ఈసారి హైదరాబాద్ వీధుల్లో తమ సత్తా చూపించాలన్న పట్టుదలతో ఉన్నారట.
అమిత్ షా పర్యటన అంటేనే హైకమాండ్‌కు స్పెషల్ టాస్క్. అందుకే ఈ పాదయాత్ర ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ నాయకత్వం ఓ యుద్ధంలా తీసుకుందట. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.
మరోవైపు గ్రేటర్ పరిధిలోని తొమ్మిది జిల్లాల నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి జనసమీకరణపై దిశానిర్దేశం చేశారట. రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి దశరథ్ హైదరాబాద్‌లోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారట. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు.. బూత్ స్థాయి నాయకులకు జనసమీకరణ టాస్కులు.. కళారూపాల ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని చాటేలా ఏర్పాట్లు.. ఇక పాదయాత్ర రూట్‌ను కూడా రాష్ట్ర నాయకత్వం రాంచందర్ రావు, కిషన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మొదట ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి యాత్ర చేయాలనుకున్నా.. ప్రజల మధ్య నుంచి యాత్ర సాగాలన్న అధిష్టానం సూచనతో రూట్ మార్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అమిత్ షా రాకకు ముందు నుంచే బీజేపీ నేతలు చెమటోడుస్తున్నారు. కానీ అసలు పరీక్ష మాత్రం నవంబర్ 2న జరగబోతోంది.
ఈ పాదయాత్ర వెనుక బీజేపీ చెబుతున్న ప్రధాన అజెండా ఎస్ఐఆర్ ప్రక్రియ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్, ఇండియా కూటమి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కమలనాథులు ఆరోపిస్తున్నారు. నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో "ఓటు బచావో - దేశ్ బచావో" పేరుతో 10 లక్షల మందితో భారీ నిరసన చేయబోతోంది కాంగ్రెస్. దీనికి కౌంటర్‌గా దేశవ్యాప్తంగా "లోక్ తంత్ర బచావో -అరాచకత్వ హటావో" పేరుతో బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది.
దేశంలో చట్టబద్ధంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందని.. డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, రోహింగ్య ఓట్లు, అర్హతలేని ఓట్లను గుర్తించి తొలగించడమే సర్ లక్ష్యమని బీజేపీ వాదిస్తోంది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టాలన్నది బీజేపీ వ్యూహం. అంతేకాదు.. ఎస్ఐఆర్ ఒక్కటే కాదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ప్రజల్లో అవగాహన.. మరోవైపు కాంగ్రెస్ పాలనపై రాజకీయ దాడి.. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం.. అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నమాట.
ఎస్ఐఆర్పై వివరణ.. కాంగ్రెస్‌పై విమర్శలు.. బీజేపీకి రాజకీయ ప్రచారం.. మరి అమిత్ షా తన ప్రసంగంలో ఏ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తారు..? అన్నదే సస్పెన్స్.
తెలంగాణలో అధికార పీఠం కోసం బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇదే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి కేంద్ర నాయకుల పర్యటనలు కొనసాగాయి.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారిగా అమిత్ షా హైదరాబాద్‌కు వస్తుండటంతో రాష్ట్ర కమలదళంలో కొత్త జోష్ కనిపిస్తోంది. గతంలో పలుమార్లు పర్యటన ఖరారై చివరి నిమిషంలో వాయిదా పడిన పర్యటన.. ఇప్పుడు పాదయాత్ర రూపంలో కార్యరూపం దాల్చుతుండటంతో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ టూర్‌ను కేవలం ఎస్ఐఆర్ అంశానికే పరిమితం చేయడం లేదట బీజేపీ నాయకత్వం.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపాలన్నది అసలు వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో పాదయాత్ర అంటే కేవలం అడుగులు వేయడం కాదు.. ఓట్ల కోసం దారులు వెతకడం కూడా... మరి అమిత్ షా వేసే ఈ అడుగులు తెలంగాణలో కమలానికి అధికార బాట వేస్తాయా? లేక మరో రాజకీయ హడావుడిగానే మిగిలిపోతాయా? చూడాలి.
ఒకవైపు అధికార కాంగ్రెస్.. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలను రాజకీయంగా టార్గెట్ చేస్తూ బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. మరి అమిత్ షా పర్యటనతో తెలంగాణలో కమలం గ్రాఫ్ పెరుగుతుందా? లక్ష మందితో పాదయాత్ర చేసి గ్రేటర్ ఎన్నికలకు గట్టి పునాది వేస్తారా? లేక ఇది మరో రాజకీయ సభగానే మిగిలిపోతుందా?
మొత్తానికి ఎన్నికల సినిమా మొదలుకాకముందే అమిత్ షా ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో ట్రైలర్ మాత్రం గట్టిగానే పడబోతోందట.
నవంబర్ 2న భాగ్యనగర్ వీధుల్లో సాగనున్న అమిత్ షా పాదయాత్ర.. బీజేపీకి ఎంత బలాన్ని ఇస్తుంది? కాంగ్రెస్‌కు ఎలాంటి రాజకీయ సవాల్ విసురుతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి కొత్త సమీకరణాలకు తెరలేపుతుంది? అన్నది ఉత్కంఠభరితంగా మారింది.




