OFF THE RECORD: మా ఊర్లోకి వెళ్తే ప్రజలు తరిమేలా ఉన్నారు సారో.. రేవంత్ పై ఆగ్రహం!
OFF THE RECORD: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిధుల కేటాయింపుపై వివాదం. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ BRS, BJP ఎమ్మెల్యేల తీవ్ర ఆగ్రహం.
OFF THE RECORD: మా ఊర్లోకి వెళ్తే ప్రజలు తరిమేలా ఉన్నారు సారో.. రేవంత్ పై ఆగ్రహం!
OFF THE RECORD: ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచాక అధికార పార్టీ, విపక్ష పార్టీ అన్న తేడా లేకుండా అందరూ ఒక్కటే అంటారు. కానీ కాంగ్రెస్ మార్క్ పాలనలో మాత్రం 'మా వాళ్లకు ఓ న్యాయం... విపక్షాలకు మరో న్యాయం' నడుస్తోందట! ఇందులోభాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ‘ఫండ్స్ పాలిటిక్స్’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గెలిచారనే కక్షతో ప్రభుత్వం నిధుల కేటాయింపు బంద్ చేసిందనే గుసగుసలు ఊపందుకున్నాయి.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గొంతులోనైతే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. "గిరిజనులు ఎక్కువున్న నా నియోజకవర్గానికి గిరిజన సంక్షేమం కింద ఇచ్చింది జస్ట్ 9 కోట్లు... అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న మంచిర్యాలకు మాత్రం రూ.25 కోట్లా..? ఇదెక్కడి న్యాయం భయ్యా?" అని రివ్యూ మీటింగ్‌లోనే నిలదీసేశారట బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి. "రోడ్లు లేవు, పనులు కావడం లేదని ఊళ్లల్లో జనం మమ్మల్ని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాం.. సీఎం గారూ, మాపై ఈ పగ ఏంది..?" అని ఆమె బహిరంగంగానే అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దల వివక్షను ఎండగట్టేశారట.
ఇక సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కథ కూడా సేమ్ టు సేమ్! "ఓట్లు పడేదాకానే రాజకీయాలు.. పనులు చేసే దగ్గర కూడా పగటి వేషాలేంటి..?" అని మండిపడుతున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే. 100 గిరిజన గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక జనం అల్లాడుతుంటే, ఒక్క పైసా నిధులు ఇవ్వకుండా సర్కార్ పక్షపాతం చూపిస్తోందని మైకుల ముందే ధ్వజమెత్తారట! "మేం విపక్ష ఎమ్మెల్యేలమైతే.. మా నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్రంలో భాగం కారా..?" అని ఆయన వేసిన ప్రశ్న కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందట.
ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు నిధుల వివక్షపై గళమెత్తడంతో ఆదిలాబాద్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి! తమ స్వరం పెంచి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది..? లేదంటే ఈ 'ఫండ్స్ ఫైట్' మున్ముందు ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.




