Tirupati: సూళ్ళూరుపేట మండలం కొన్నేంబట్టులో తాగునీటి సరఫరా బంద్!

Tirupati: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం కొన్నేంబట్టులో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలు. వీధిలైట్లు లేక అంధకారం.

KKV Sudhakar, Sullurupeta
Published on: 6 Oct 2026 10:18 AM IST
Tirupati: సూళ్ళూరుపేట మండలం కొన్నేంబట్టులో తాగునీటి సరఫరా బంద్!
X

Tirupati: సూళ్ళూరుపేట మండలం కొన్నేంబట్టులో తాగునీటి సరఫరా బంద్! తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం కొన్నేంబట్టు గ్రామంలో మౌలిక సదుపాయాల లేమితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకు కూడా నీరు అందక మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర యాతనకు గురవుతున్నారు.

​ఒకవైపు పలు ప్రాంతాల్లో నీరు వృథాగా పోతుంటే, మరోవైపు కొన్నేంబట్టులో నాలుగు రోజులుగా చుక్క నీరు కూడా రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"నాలుగు రోజులుగా చుక్క నీరు లేక, పసిపిల్లల ఆకలి కేకల నడుమ బిందెడు నీటి కోసం కిలోమీటర్ల బాట పడుతోంది కొన్నేంబట్టు! ఎస్సీ సామాజికవర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారనే నిర్లక్ష్యంతోనే అధికారులు పట్టించుకోవడంలేదా?" అని గ్రామస్తులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

​తాగునీటి సమస్యే కాకుండా, గ్రామంలోని పలు వీధుల్లో వీధిలైట్లు వెలగకపోవడం రాత్రి వేళల్లో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. "రాత్రి వేళల్లో అంధకార బంధురమైన వీధులు, భయంతో ముళ్లకంపలా మారిన ప్రతి ప్రయాణం... మౌలిక వసతులు కల్పించాల్సిన పాలకుల మౌనం ఈ పేద గ్రామానికి శాపంగా మారింది!" అని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రి డ్యూటీలు ముగించుకుని ఇళ్లకు తిరిగొచ్చే మహిళలు, కార్మికులు, యువకులు చీకటి బాటల్లో ప్రయాణించలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పయనిస్తున్నారు.

​ఇకనైనా నిద్రమత్తు వీడి గ్రామంలో తక్షణమే తాగునీటి సరఫరాను పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అలాగే వీధిలైట్లు లేని ప్రాంతాలను గుర్తించి వెంటనే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా మరియు మండల అధికారులు తక్షణమే స్పందించి కొన్నేంబట్టు గ్రామ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta