Tirupati: విశాఖ సీఐఐ సదస్సు గ్రాండ్ సక్సెస్: శాప్ ఛైర్మన్ రవి నాయుడు!
Tirupati: విశాఖ సీఐఐ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయిందని, వైసీపీ రూ.3,828 కోట్ల ఫీజు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం రూ.4,962 కోట్లు విడుదల చేసిందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు మంగళవారం తిరుపతిలో తెలిపారు.
Tirupati: విశాఖ సీఐఐ సదస్సు గ్రాండ్ సక్సెస్: శాప్ ఛైర్మన్ రవి నాయుడు!
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నామని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ కావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన గత వైసీపీ ప్రభుత్వ పాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక పెట్టుబడులు, విద్యార్థుల సంక్షేమం, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై మాట్లాడారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కియా, అమరరాజా వంటి పరిశ్రమలతో పాటు డాయర్ కంపెనీని సైతం ఇబ్బందులకు గురిచేశారని రవి నాయుడు విమర్శించారు. పారిశ్రామికవేత్తలను వేధించడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం ఏర్పడిందన్నారు. అప్పట్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు సైతం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని సూచించే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు.
విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు సుమారు 20 దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు హాజరుకావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ, విజన్‌ను పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు అభినందించారని తెలిపారు.
రాష్ట్రంలోని యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ముందుకు సాగుతోందని వివరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీకి ప్రశ్నలు
ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను రవి నాయుడు తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని మార్చడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులను తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడంతో ఫీజుల వ్యత్యాసాన్ని వారు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సుమారు రూ.3,828 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని విమర్శించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా నేరుగా కళాశాలలకే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.4,962 కోట్ల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు.
విద్యారంగంలో సమూల మార్పులు
విద్యావ్యవస్థలో నాణ్యత పెంపొందించేందుకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని రవి నాయుడు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన కుటుంబాల్లోని పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన యూనిఫాంలు, విద్యా సామగ్రి పంపిణీతో పాటు మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు, పాఠశాలల అభివృద్ధికి స్పాన్సర్షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఉపాధ్యాయులకు అంతర్జాతీయ విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు సింగపూర్ వంటి దేశాలకు శిక్షణ కోసం పంపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మార్చారని, ఉపాధ్యాయ నియామకాలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీపై నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ, టెట్ వంటి ప్రక్రియల ద్వారా విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తోందన్నారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అరికట్టడంతో పాటు యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు.




