Tiruchanoor: వైభవంగా అమ్మవారి పంచమితీర్థం.. పటిష్ట ఏర్పాట్లు!

Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, పంచమితీర్థం ఏర్పాట్లపై టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ సమీక్షించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 25 Nov 2026 12:47 PM IST
Tiruchanoor
X

Tiruchanoor: వైభవంగా అమ్మవారి పంచమితీర్థం.. పటిష్ట ఏర్పాట్లు!

Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమితీర్థానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బుధవారం తిరుమల నుంచి తిరుచానూరుకు శ్రీవారి పడి సారెను తీసుకువచ్చే ఊరేగింపు మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్‌లో అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవాలు, పంచమితీర్థం ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించే పడి సారె మన ప్రాచీన ధార్మిక సంప్రదాయాలకు, తిరుమల–తిరుచానూరు ఆలయాల మధ్య ఉన్న పవిత్ర అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. ఈ అపురూపమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.

శ్రీవారి సారె ఊరేగింపు మార్గంలో ట్రయల్ రన్

తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ వినాయకస్వామివారి ఆలయం నుంచి శ్రీవారి పడి సారె ఊరేగింపు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఏనుగుపై సారెను తీసుకువెళుతూ శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజూర్ కార్యాలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతిపురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్, డిప్యూటీ ఈవోలు హరేంద్రనాథ్, శాంతి, శివప్రసాద్, విజివో, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL