Tirumala: శ్రీవారి భక్తులకు కొండంత భరోసా.. ‘యాత్ర సురక్ష’ బీమా చెక్కుల పంపిణీ!

Tirumala: తిరుమలలో మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు 'శ్రీవారి యాత్ర సురక్ష' పథకం కింద టీటీడీ, ఎల్ఐసీ రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారం అందజేశాయి

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 24 Nov 2026 3:49 PM IST
Tirumala
X

Tirumala: శ్రీవారి భక్తులకు కొండంత భరోసా.. ‘యాత్ర సురక్ష’ బీమా చెక్కుల పంపిణీ!

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అండగా నిలిచేందుకు టీటీడీ మరో కీలక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం ద్వారా భక్తుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలో గత రెండు నెలల వ్యవధిలో మరణించిన ఏడుగురు భక్తుల కుటుంబ సభ్యులకు టీటీడీ, ఎల్ఐసీ సంయుక్తంగా రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని అందజేశాయి.

మంగళవారం తిరుమలలో నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ సీఈవో,ఎండీ ఆర్.దొరైస్వామి కుటుంబ సభ్యులకు పరిహారం అందించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

సెప్టెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం కింద సహజ మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం అందించనున్నట్లు ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గత రెండు నెలల్లో తిరుమలలో 17 మంది భక్తులు మరణించగా.. ఇప్పటివరకు ఏడుగురు కుటుంబాలకు పరిహారం అందించామని, మిగిలిన కుటుంబాలకు కూడా త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు.

ఈ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి సుమారు ఏడాదిన్నర పాటు కృషి చేసినట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. పథకానికి సహకరించిన ఎల్ఐసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో బీమా పరిహారాన్ని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

మరణ ధృవీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు అందిన వెంటనే పరిహారం చెల్లించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామి తెలిపారు. భక్తుల కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీటీడీ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశంలోని ఇతర దేవస్థానాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. శబరిమల ట్రావెన్‌కోర్ దేవస్థానం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ అధికారులు సైతం ఈ పథకం అమలుపై ఆసక్తి చూపుతూ సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తమిళనాడు, హైదరాబాద్, చెన్నై, గుంటూరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు మృత భక్తుల కుటుంబ సభ్యులు బీమా పరిహారం అందుకున్నారు. కష్టకాలంలో తమకు ఆర్థికంగా అండగా నిలిచిన టీటీడీకి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల ఆధ్యాత్మిక యాత్రను మరింత భద్రంగా మార్చడంతో పాటు, అనుకోని విషాదం ఎదురైనప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక అండగా నిలవడమే ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ప్రధాన ఉద్దేశం.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.