Tirupati: టీటీడీ ఎస్వీ గోశాలకు 5 దేశీయ గోవులను విరాళంగా అందజేసిన అదనపు ఈవో!
Tirupati: తిరుపతి ఎస్వీ గోశాలకు 5 దేశీయ గోవులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి విరాళంగా అందజేశారు. గోశాల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
Tirupati: టీటీడీ ఎస్వీ గోశాలకు 5 దేశీయ గోవులను విరాళంగా అందజేసిన అదనపు ఈవో!
తిరుపతి: సనాతన ధర్మంలో గోమాతకు అత్యంత విశిష్ట స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలకు బుధవారం ఆయన 5 దేశీయ గోవులను విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు ముందుగా ఎస్వీ గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అదనపు ఈవో చేతుల మీదుగా శాస్త్రోక్తంగా గోదాన పూజ చేయించారు. పూజా కార్యక్రమాల అనంతరం అదనపు ఈవో స్వయంగా గోవులకు దాణా అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. గోవును పవిత్రమైన తల్లిగా భావించి పూజించడం భారతీయ సనాతన సంప్రదాయమని అన్నారు. ఏ చిన్న శుభకార్యమైనా గోపూజతో ప్రారంభించడం శుభ పరిణామమని సనాతన ధర్మం చెబుతోందని గుర్తుచేశారు.
అనంతరం విరాళంగా తెచ్చిన 5 దేశీయ గోవులను ఎస్వీ గోశాల డైరెక్టర్ శివకుమార్కు అధికారికంగా అప్పగించారు. గోదానంతరం గోశాల ప్రాంగణాన్ని పరిశీలించిన అదనపు ఈవో.. అక్కడ గోవులకు అందిస్తున్న దాణా, వాటి నిరంతర ఆరోగ్య సంరక్షణ, పరిసరాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గోవుల సంరక్షణ విషయంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గోశాల క్రమశిక్షణ, నిర్వహణ తీరుపై ఆయన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ గోశాల మేనేజర్లు డాక్టర్ డి. నాగరాజు, డాక్టర్ టి.వి. సుధాకర్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.




