Tirupati: ఎస్వీయూ వేదికపై పూర్వ విద్యార్థిని కార్పొరేటర్‌గా ప్రమాణం
Tirupati: తిరుపతి 11వ వార్డు కార్పొరేటర్‌గా ఎస్వీయూ ప్రాంగణంలో ప్రమాణం చేసిన పూర్వ విద్యార్థిని బి. జ్యోత్స్న; వీసీ తాటా నారసింగరావు హర్షం.
Tirupati: ఎస్వీయూ వేదికపై పూర్వ విద్యార్థిని కార్పొరేటర్‌గా ప్రమాణం
తిరుపతి: విశ్వవిద్యాలయం అంటే కేవలం పట్టాలు అందించే విద్యాలయం మాత్రమే కాదు.. అక్కడ చదువుకున్న విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగి, అదే విద్యాలయానికి గుర్తింపు తీసుకొచ్చినప్పుడే దాని ఘనత మరింత పెరుగుతుంది. ఒకప్పుడు ఉన్నత విద్య కోసం ఎస్వీయూలో అడుగుపెట్టిన విద్యార్థిని.. నేడు ప్రజాప్రతినిధిగా అదే విశ్వవిద్యాలయ వేదికపై ప్రమాణ స్వీకారం చేయడం అందుకు ఓ ఉదాహరణగా నిలిచింది.
తిరుపతి పదకొండో వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన బి. జ్యోత్స్న ప్రస్థానం ఇప్పుడు విశ్వవిద్యాలయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.తిరుపతి నగర పాలక సంస్థ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణలో భాగంగా సోమవారం ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పదకొండో వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన జ్యోత్స్నతో జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ప్రమాణం చేయించారు.
అయితే ఈ కార్యక్రమంలో జ్యోత్స్న ప్రమాణ స్వీకారం కంటే ఆమె విద్యార్థి దశకు, ప్రస్తుత బాధ్యతలకు మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా నిలిచింది.ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తాటా నారసింగరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసిన తాను.. తిరిగి అదే ప్రాంగణంలో కార్పొరేటర్‌గా ప్రమాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
తన విద్యార్థి జీవితానికి గుర్తుగా నిలిచిన ఎస్వీయూ ఇప్పుడు ప్రజాప్రతినిధిగా తన కొత్త బాధ్యతలకు వేదిక కావడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన నందమూరి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వీసీ ఆచార్య తాటా నారసింగ రావు మాట్లాడుతూ.. ఇదే విశ్వవిద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థిని ఇప్పుడు కార్పొరేటర్‌గా ఎదిగి, అదే ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం విద్యాసంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు.ఒక విద్యార్థిని ఎదుగుదల.. ఒక విశ్వవిద్యాలయానికి గర్వకారణం. తరగతి గదుల్లో నేర్చుకున్న విద్యతో సమాజంలో బాధ్యతాయుతమైన స్థానానికి చేరుకుని, తాను చదువుకున్న ప్రాంగణంలోనే కొత్త బాధ్యతలు స్వీకరించడం జ్యోత్స్న ప్రయాణంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ పాల్గొన్నారు.




