Tirupati: అనాథ విద్యార్థుల సంక్షేమానికి తిరుపతి ఎస్పీ ప్రత్యేక చొరవ!

Tirupati: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయ విద్యార్థులకు రూ.35,000 అద్దె భారం తొలగిస్తూ ఉచిత భవనం, బాలల దినోత్సవాన పుస్తకాలను తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అందించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 14 Nov 2026 2:26 PM IST
Tirupati
X

Tirupati: అనాథ విద్యార్థుల సంక్షేమానికి తిరుపతి ఎస్పీ ప్రత్యేక చొరవ!

Tirupati: నిరుపేద, అనాథ పాక్షిక అనాథ బాలబాలికలకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, పోషకాహారం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో REALS సంస్థ మరియు సమగ్ర శిక్ష, తిరుపతి వారి సంయుక్త సహకారంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం నిర్వహించబడుతోంది. తల్లిదండ్రుల ఆదరణకు దూరమైన పిల్లలకు విద్యావకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంలో ఈ విద్యాలయం కీలక పాత్ర పోషిస్తోంది.

గతంలో ఈ విద్యాలయం తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో ఒక ప్రైవేటు భవనంలో నెలకు రూ.35,000 అద్దె చెల్లిస్తూ నిర్వహించబడేది. ఈ నేపథ్యంలో, 2025 నవంబర్‌లో *తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సమస్యలను, నిర్వహణపరమైన ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి మెరుగైన వసతి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

జిల్లా ఎస్పీ చేసిన నిరంతర కృషి, ప్రత్యేక సిఫార్సుల ఫలితంగా జిల్లా కలెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ చెన్నారెడ్డి కాలనీలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల మొదటి అంతస్తును ఈ విద్యాలయ నిర్వహణకు ఉచితంగా కేటాయించారు. దీంతో విద్యాలయానికి నెలకు రూ.35,000 చొప్పున ఉన్న అద్దె భారం తొలగిపోవడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థుల అవసరాలను గుర్తించి, వారికి శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా జిల్లా ఎస్పీ తీసుకున్న చొరవకు ఇది నిదర్శనం.

ఈ సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ గారు మరోసారి విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, అవసరాలు, భవిష్యత్తు ఆశయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు వారికి అవసరమైన పుస్తకాలు, నోట్‌బుక్స్ మరియు ఇతర విద్యా సామగ్రిని అందజేశారు. అనంతరం విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.

తల్లిదండ్రుల ఆదరణకు దూరమైన పిల్లలకు విద్య, వసతి, పోషణ మరియు భద్రత కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా చాటిచెప్పారు. బాలల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పిల్లలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, వారి విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం, వారి కలలను సాకారం చేసుకునేందుకు ప్రోత్సహించడం సామాజిక బాధ్యతలో భాగమని జిల్లా ఎస్పీ చొరవ తెలియజేస్తోంది. విద్యార్థులందరూ చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి, భవిష్యత్తులో సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా నిలవాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL