Tiruchanur: తిరుచానూరులో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులతో సీఐటీయూ ర్యాలీ!
Tiruchanur: నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుచానూరు ప్రైవేట్ బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బస్సులతో ర్యాలీ నిర్వహించారు.
Tiruchanur: తిరుచానూరులో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులతో సీఐటీయూ ర్యాలీ!
తిరుపతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఢిల్లీ ముట్టడిని జయప్రదం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు ప్రైవేట్ బస్టాండ్ వద్ద ఏఆర్టీడబ్ల్యూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ బస్సులను వరుసగా నిలిపి నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఢిల్లీ ముట్టడి డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎస్. జయచంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టబద్ధమైన హక్కులను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కోడ్ల వల్ల ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పని గంటలు, యూనియన్ హక్కులు, సామాజిక భద్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, క్లీనర్లు, అటెండర్లు తదితర ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, పెన్షన్ తదితర సంక్షేమ సదుపాయాలు కల్పించాలని కోరారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక హక్కులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలని, డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే ఢిల్లీ ముట్టడిలో పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లాలోని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, డ్రైవర్లు, ఇతర రంగాల కార్మికులు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కె. సుమన్, ఏఆర్టీడబ్ల్యూ జిల్లా నాయకులు వాసు, ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి శివప్రసాద్, వరదారెడ్డి, పద్మనాభం, ఉమాపతి, రవి, ఉదయ్ కుమార్, వేణుగోపాల్, నీలకంఠ, శివకుమార్, మణి, శ్రీనివాసులు, భాస్కర్, బలరాం, పలని, రమేష్, గిరి, రమణ, ఓబులేష్, బాలు తదితరులు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, ఇతర ట్రాన్స్పోర్ట్ కార్మికులు పాల్గొన్నారు.




