Renigunta: ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని 16 పల్లెల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా అభివృద్ధి సంఘం సంతకాలు సేకరించి శుక్రవారం ఎంపీడీవోకు అందజేసింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 13 Nov 2026 7:08 PM IST
Renigunta
X

Renigunta: ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి!

రేణిగుంట, నవంబర్ 13: కరకంబాడి పంచాయతీ పరిధిలోని 16 పల్లెల్లో ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. గత మూడు, నాలుగు రోజులుగా పల్లెల్లో పర్యటించి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.

ఈ సందర్భంగా అభివృద్ధి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు, అభ్యర్థులపై ఒత్తిళ్లు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల ప్రక్రియను మీడియా ప్రతినిధులు పరిశీలించేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

సేకరించిన సంతకాల పత్రాలను ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, ఎంపీడీవో, ఎస్పీ తదితర అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించి తమ డిమాండ్లను వివరించారు. అనంతరం సంతకాల పత్రాలను ఎంపీడీవోకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సీఐటీయూ మండల నాయకులు సెల్వరాజ్ పర్యవేక్షించగా, అభివృద్ధి సంఘం కార్యకర్తలు సత్యశ్రీ, రాజశేఖర్, శివానందం పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA