Tirupati: ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ఎంపీ మద్దిల గురుమూర్తి!

Tirupati: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఈసీ, కలెక్టర్, ఎస్పీలకు లేఖలు రాశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 15 Oct 2026 3:23 PM IST
Tirupati
X

Tirupati: ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ఎంపీ మద్దిల గురుమూర్తి!

Tirupati: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, బెదిరింపులు ఎదురుకాకుండా భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్, తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు.

అక్టోబర్ 14న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన పరిపాలనా సౌకర్యాలు కల్పించి, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలు జరగకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీసు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ఆ హక్కుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA