Renigunta: రేణిగుంటలో పోలింగ్ కేంద్రాల తనిఖీ.. సీఐ జయచంద్ర హెచ్చరిక!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పరిధిలోని పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సీఐ ఎస్. జయచంద్ర పరిశీలించారు.
Renigunta: రేణిగుంటలో పోలింగ్ కేంద్రాల తనిఖీ.. సీఐ జయచంద్ర హెచ్చరిక!
రేణిగుంట: త్వరలో జరగనున్న పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాలను పోలీసులు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేణిగుంట సీఐ ఎస్. జయచంద్ర, ఎస్‌ఐ వై. శ్రీనివాసులు పోలీసు సిబ్బందితో కలిసి పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, కాంపౌండ్ వాల్స్ పరిస్థితి, విద్యుత్, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు, ఓటర్లు మరియు ఎన్నికల సిబ్బంది రాకపోకలకు సంబంధించిన మార్గాలను పరిశీలించారు.
అలాగే ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు, స్థానిక సమస్యలపై అధికారులు ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా మౌలిక వసతుల సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని సీఐ జయచంద్ర తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




