Renigunta: రేణిగుంట రాజకీయాల్లో ఆసక్తికర చర్చ.. యువనేత అసంతృప్తి?

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట సర్పంచ్ అభ్యర్థిత్వం విషయంలో కూటమి పెద్దలు సీనియర్ నాయకుడికి మొగ్గు చూపడంతో ఆశలు పెట్టుకున్న ఓ యువనేత అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 19 Nov 2026 11:37 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట రాజకీయాల్లో ఆసక్తికర చర్చ.. యువనేత అసంతృప్తి?

రేణిగుంట: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి నడిచిన ఒక యువనేత, నేడు అధికారంలోకి వచ్చాక తనకు దక్కాల్సిన గుర్తింపు రాలేదన్న మనస్తాపంతో అజ్ఞాతంలోకి వెళ్లడం రేణిగుంట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.స్థానిక వర్గాలు మరియు పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సర్పంచ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సదరు తెలుగు తమ్ముడు, అధిష్టానం నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.

పోరాటాలే ఊపిరిగా.. కేసులైనా లెక్కచేయకుండా:

గత ప్రభుత్వ హయాంలో రేణిగుంట మండలం,పట్టణ పరిధిలో జరిగిన భూ ఆక్రమణలపై ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు) పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు.ఆ సమయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అండగా నిలిచిన ఈ యువనేత,ఆక్రమణదారులపై గళమెత్తారు.

ఈ క్రమంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా,తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి పలు కేసులు నమోదైనా వెనకడుగు వేయకుండా పార్టీ కోసం పనిచేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాకుండా,గత జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం కీలక పాత్ర పోషించారు.

పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో,తన కష్టానికి తగిన ప్రతిఫలంగా రేణిగుంట సర్పంచ్ పదవి తనకే దక్కుతుందని ఆ యువనేత ఆశగా ఎదురుచూశారు.అయితే, సామాజిక సమీకరణాలు మరియు పార్టీ సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్న కూటమి పెద్దలు,సీనియర్ మోస్ట్ నాయకుడికి ఆ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించారు.

అజ్ఞాతంలోకి యువనేత..పార్టీలో చర్చ

అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువనేత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.కష్టనష్టాలను ఓర్చి, కేసులను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడిన వ్యక్తి ఇలా అకస్మాత్తుగా కనుమరుగు కావడంపై రేణిగుంట పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లారు,భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.మరోవైపు,పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అనేది వేచి చూడాలి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA