Tirupati: తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్!

Tirupati: తిరుపతి జిల్లాలో 1,522 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 5 Nov 2026 12:04 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లాలో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్!

Tirupati: తిరుపతి జిల్లావ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం తిరుచానూరు జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,522 పోలింగ్ కేంద్రాల్లో 31 జెడ్పీటీసీ స్థానాలకు, 302 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని, ఉదయం 9 గంటల సమయానికి సుమారు 11.8 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. సాయంత్రానికి మరింత అధిక పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్‌లు, ప్రత్యేక క్యూ లైన్లు, షామియానాలు, తాగునీరు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. వృద్ధులు, ఇతర ఓటర్ల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా, మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. గతంలో సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

ఓటరు స్లిప్ లేకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

ఓటరు స్లిప్పుల పంపిణీపై వస్తున్న సందేహాలపై కలెక్టర్ స్పందిస్తూ, ఓటరు స్లిప్ అనేది కేవలం ఓటరుకు పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితాలోని వరుస సంఖ్య తెలుసుకునేందుకు కల్పించే సౌకర్యం మాత్రమేనని, ఓటు వేయడానికి అది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం గుర్తించిన 22 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.

ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి అర్బన్ ప్రాంతాల్లో గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఓటరు స్లిప్పుల పంపిణీ సుమారు 70 నుంచి 75 శాతం వరకు మాత్రమే జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రతి పోలింగ్ కేంద్రం వెలుపల హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి, ఓటర్లకు వారి పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితాలోని వరుస సంఖ్యను తెలియజేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

చంద్రగిరి నియోజకవర్గంలో ఉదయం టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ, వెంటనే పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం పోలింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోందని తెలిపారు.

ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఎలాంటి తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు లేవని తెలిపారు. కోడూరు మండలం ఆర్.టి. రెడ్డిపల్లి గ్రామంలో ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుందని, ఆ సమయంలో ఎన్నికల పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదని వివరించారు.

ఈ ఘటనలో కొన్ని పోస్టర్లకు నిప్పంటించగా, కొందరు దీనిని పెట్రోల్ బాంబుల ఘటనగా ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ బాంబులు విసరడం లేదా పేలుళ్లు జరగడం వంటి ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

జిల్లాలో అక్కడక్కడ జరిగిన చిన్నచిన్న ఘటనలను కూడా పోలీసులు తక్షణమే నియంత్రించారని, ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి, తిరుపతి రూరల్ తాసిల్దార్ జనార్ధన్, ఎంపీడీవో, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL