Tirupati: ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్!

Tirupati: తిరుపతి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 404 పంచాయతీల్లో 136 ఏకగ్రీవం కాగా, రేణిగుంట కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ పరిశీలించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 26 Nov 2026 5:36 PM IST
Tirupati
X

Tirupati: ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్!

తిరుపతి: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి కొనసాగిన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం పలు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది.

తొలి విడతలో మొత్తం 404 పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, అందులో 136 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన పంచాయతీల్లో ఉదయం నుంచి పోలింగ్ సజావుగా సాగింది. ఒకటి రెండు చోట్ల స్వల్ప వివాదాలు తలెత్తినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలింగ్ ముగియడంతో అన్ని కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే పలు పంచాయతీల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, ఇతర కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీగా గుర్తింపు పొందిన రేణిగుంటలోని కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA