Tirupati: క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి మెరుగైన వైద్యం అందించాలి!

Tirupati: క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి బాధితులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ‘ఇంపాక్ట్’ సదస్సులో పిలుపునిచ్చారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 25 Nov 2026 1:50 PM IST
Tirupati
X

Tirupati: క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి మెరుగైన వైద్యం అందించాలి!

తిరుపతి, నవంబర్ 25: క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడంతో పాటు, వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

బుధవారం తిరుపతిలో నిర్వహించిన ‘ఇంపాక్ట్ (IMPACT)’ సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం సామాన్య ప్రజలు భారీగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని, కుటుంబాలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాల ద్వారా అనుమానిత కేసులను గుర్తించడం మాత్రమే కాకుండా, వారిని తదుపరి దశలో ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు తీసుకెళ్లి అవసరమైన పరీక్షలు, చికిత్స అందేలా చూడాలన్నారు. తిరుపతి జిల్లాలో నిర్వహించిన స్క్రీనింగ్ కార్యక్రమాల్లో గుర్తించిన అనుమానిత కేసుల్లో కేవలం 8 నుంచి 9 శాతం మంది మాత్రమే ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు చేరుకుంటున్నారని తెలిపారు. దీనికి ప్రజల్లో ఉన్న భయం, సామాజిక అపోహలు, వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో తీవ్రంగా కనిపించకపోవడం వంటి అంశాలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.

క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, స్క్రీనింగ్ నుంచి చికిత్స వరకు ప్రతి దశలో బాధితులకు మార్గదర్శకత్వం, సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గుర్తించిన ప్రతి అనుమానిత కేసును తదుపరి వైద్య సేవలతో అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు సాధిస్తాయన్నారు.

ప్రభుత్వ వైద్య వ్యవస్థలు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే క్యాన్సర్ సంరక్షణ సేవలను మరింత విస్తరించవచ్చన్నారు. టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఐదు రాష్ట్రాల్లో 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ నిర్వహించడం, విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ మరిన్ని జిల్లాలకు తన సేవలను విస్తరిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్, ఫైజర్ లిమిటెడ్ ప్రతినిధులు, డాక్టర్ కైలాష్ శర్మ, డాక్టర్ శైలేష్ శ్రీఖండే, డాక్టర్ మేజర్ జనరల్ ప్రసాద్, డాక్టర్ పంకజ్ గుప్తా, డాక్టర్ ప్రశాంత్ పెనుమడు తదితర వైద్య రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL