Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు!

Tirumala: తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఈసారి అదనంగా 51 వేల మందికి దర్శనం కల్పించనున్నారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 19 Nov 2026 11:19 AM IST
Tirumala
X

Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు!

తిరుమల: తిరుమలలో టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఉద్యోగుల సంక్షేమం, వైద్య సేవల విస్తరణ తదితర అంశాలపై సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాకు వెల్లడించారు.

డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. గత ఏడాది 7.45 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. ఈసారి గత ఏడాది కంటే అదనంగా మరో 51 వేల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తొలి రెండు రోజులు మాత్రమే డిప్ విధానంలో టోకెన్లు కేటాయించి.. మిగిలిన ఎనిమిది రోజులు సర్వదర్శనం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

తిరుపతిలో రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణానికి సమావేశం ఆమోదం తెలిపింది. తిరుమల, తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలో నెయ్యి అవసరాల కోసం టీటీడీ సొంతంగా 500 ఆవులను రూ.7.7 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల, తిరుపతి పరిసరాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం రెండేళ్ల కాలానికి రూ.16.4 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల కానుకగా టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందులో సగం చెల్లించనున్నారు. వేద పారాయణదారులు, ప్రబంధం చేసే వారి వేతనాల పెంపునకు కూడా సమావేశం ఆమోదం తెలిపింది. మరోవైపు స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య పరికరాల బకాయిల చెల్లింపుల కోసం రూ.41.2 కోట్ల గ్రాంటు విడుదలకు ఆమోదం తెలిపారు.

వైద్య సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శిల్ప కళాశాల హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.23 కోట్లు కేటాయించారు. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి సంబంధించి రూ.230 కోట్ల నిధులతో పాటు ఉద్యోగుల వాటాగా రూ.80 కోట్ల ఖర్చును నిర్ణయించారు. ఇలా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల నుంచి ఉద్యోగుల సంక్షేమం వరకు పలు కీలక అంశాలపై టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం నిర్ణయాలు తీసుకుంది.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.