Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా పుష్పక విమాన సేవ
Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేతంగా గోవర్ధనగిరిధారి అలంకారంలో పుష్పక విమానంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు.
Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా పుష్పక విమాన సేవ
తిరుమల: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రుక్మిణి, సత్యభామ సమేతంగా గోవర్ధనగిరిధారి శ్రీకృష్ణుని అలంకారంలో పుష్పక విమానంపై అభయమిచ్చిన స్వామివారి మంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
విశేషం ఏమిటి?
మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ పుష్పక విమానసేవను నిర్వహించడం అత్యంత విశేషం. సాధారణంగా వాహనసేవల అనంతరం స్వామి, అమ్మవార్లు సేదతీరే సంప్రదాయంలో భాగంగా ఈ సేవను నిర్వహిస్తారు.
కొబ్బరి ఆకులతో అద్భుత పుష్పక విమానం
కొబ్బరి చెట్ల ఆకులతో రూపొందించిన ఈ ప్రత్యేక పుష్పక విమానం 24 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో, సుమారు ఒక టన్ను బరువు కలిగి ఉంది. వివిధ రకాల సంప్రదాయ పుష్పాలతో దీనిని అత్యంత సుందరంగా అలంకరించారు. విమానానికి ఇరువైపులా శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుడు, నాలుగు యుగాలకు చెందిన దేవతామూర్తుల రూపాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
వారం రోజుల శ్రమ: తమిళనాడుకు చెందిన నిపుణులు, టీటీడీ గార్డెన్ విభాగం సిబ్బంది వారం రోజుల పాటు శ్రమించి ఈ అద్భుత పుష్పక విమానాన్ని సిద్ధం చేసినట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. చెన్నైకి చెందిన దాత రాంప్రసాద్ భట్ ఈ పుష్పక విమాన రూపకల్పనకు పూర్తి సహకారం అందించారు.
ఈ పుష్పకవిమానం సేవలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర ప్రముఖ అధికారులు పాల్గొన్నారు.




