Tiruchanur: తిరుచానూరులో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి, చక్రస్నానంతో శనివారం అత్యంత వైభవంగా ముగిశాయి.
Tiruchanur: తిరుచానూరులో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
Tiruchanur: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ అమ్మవారి పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. పవిత్రోత్సవాల చివరి రోజైన శనివారం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తిభావంతో చక్రస్నానం
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు,
శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
మాడ వీధుల్లో అమ్మవారి వైభవోత్సవం
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారగా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఎ. శరత్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు మునిచెంగల్రాయలు, రమేష్, సురేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంతం, మునస్వామి ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.




