Tiruchanur: తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈవో

Tiruchanur: డిసెంబరు 6 నుంచి 14 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 20 Nov 2026 8:34 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈవో

తిరుచానూరు: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వాహన సేవలతో పాటు భక్తులందరికీ శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తి దర్శనం సజావుగా కల్పించేలా క్యూ లైన్లు, దర్శన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.

భక్తులకు నిరంతర తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత, రవాణా తదితర సౌకర్యాలను సమర్థవంతంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు.

పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ

జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.

భక్తుల కోసం హోల్డింగ్ పాయింట్ల పరిశీలన

అంతకుముందు జేఈవో, సీవీఎస్ఓ, జిల్లా ఎస్పీ వాహన మండపం, ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూ లైన్లు, పద్మ పుష్కరిణిని పరిశీలించారు. పూడి రోడ్డులో భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న షెల్టర్లతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నవజీవన్ ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయనున్న హోల్డింగ్ పాయింట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ మనోహరం, ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL