Sullurpeta: సూళ్ళూరుపేట, తడ మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత!

Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట, తడ మండలాల్లోని 37 పంచాయతీలకు నవంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న రెండవ విడత నామినేషన్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీఐ ఎం. మురళీకృష్ణ మంగళవారం తెలిపారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 17 Nov 2026 9:45 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేట, తడ మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత!

సూళ్ళూరుపేట/తడ: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ, సూళ్ళూరుపేట మరియు తడ మండలాల్లో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గతంలో జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మాదిరిగానే ఈసారీ ఎలాంటి అల్లర్లకు తావులేకుండా ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

​ఈ ఎన్నికల్లో భాగంగా సూళ్ళూరుపేట మండలంలో 19 పంచాయతీలు, తడ మండలంలో 18 పంచాయతీలు కలిపి మొత్తం 37 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి మండలంలో 3 చొప్పున మొత్తం 6 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలోని మంగళంపాడు (8 గ్రామాలు), కోటపోలూరు (5 గ్రామాలు), కేసీఎన్ గుంట (6 గ్రామాలు) కేంద్రాలలో నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. అలాగే తడ మండలంలో కొండూరు (5 గ్రామాలు), తడ ఎంఈఓ ఆఫీసు (5 గ్రామాలు), కారూరు (8 గ్రామాలు) తదితర ప్రాంతాల్లో మొత్తం 18 గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 29వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలు కూడా వెలువడతాయని తెలిపారు. ఇందుకు గాను నామినేషన్ల స్వీకరణ 18, 19, 20 తేదీల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు.

​శాంతిభద్రతల పరిరక్షణార్థం 6 మంది ఎస్ఐలు, ప్రతి మండలానికి ఒక సీఐతో పాటు సుమారు 100 మంది పోలీసు సిబ్బందిని మోహరించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ ఎం.మురళీకృష్ట తెలిపారు. పాత సంఘటనలు మరియు రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక (సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్) ప్రాంతాలను గుర్తించి, ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరూ గుంపులు గుంపులుగా నిలబడరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లు లేదా గొడవలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పాత నేరస్తులను బైండోవర్ చేసి రాజకీయ పార్టీల అభ్యర్థులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.

​నామినేషన్ కేంద్రాల వద్ద మరియు బయట ప్రత్యేక కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం వీడియో సర్వైలెన్స్ కొనసాగుతుందని, అభ్యర్థుల ప్రతి కదలికను రికార్డు చేసి ఎలక్షన్ కమిషన్‌కు నివేదిస్తామని తెలిపారు. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంతంగా వచ్చి నామినేషన్లు దాఖలు చేయాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించి గ్రామాలలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని సీఐ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

​ఈ మీడియా సమావేశంలో సూళ్ళూరుపేట ఎస్సై జి.అజయ్ కుమార్, తడ ఎస్సై కె.కొండప్పనాయుడు, శ్రీహరికోట ఎస్సై భాను ప్రసన్న పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta