Sullurupeta: సూళ్ళూరుపేటలో 'ఆపరేషన్ త్రిశూల్' ప్రారంభం

Sullurupeta: సూళ్ళూరుపేట సర్కిల్‌లో 'ఆపరేషన్ త్రిశూల్' కార్యక్రమం. మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రహదారి భద్రతే ప్రధాన లక్ష్యాలని సీఐ మురళీకృష్ణ వెల్లడి.

KKV Sudhakar, Sullurupeta
Published on: 29 Sept 2026 5:02 PM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేటలో 'ఆపరేషన్ త్రిశూల్' ప్రారంభం

సూళ్ళూరుపేట: ​తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలోని తడ, సూళ్ళూరుపేట ప్రాంతాలు యువత ఉపాధికి నిలయంగా మారి అనేక ప్రముఖ పరిశ్రమలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, అయితే అదే సమయంలో రవాణా పెరిగి నిత్యం తీవ్ర రద్దీ ప్రాంతాలుగా మారాయని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ జీ. చెంచుబాబు ఆధ్వర్యంలో 'ఆపరేషన్ త్రిశూల్' (ముప్పేట ప్రజా భద్రతా కార్యక్రమం) నిర్వహించామన్నారు.

ఇందులో భాగంగా సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక భారీ పరిశ్రమలు కొలువుదీరడం శుభపరిణామమని, పారిశ్రామిక పురోగతికి అనుగుణంగా ప్రజల భద్రత కోసం పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ 'ఆపరేషన్ త్రిశూల్' యొక్క ప్రధానమైన మూడు ముఖ్య లక్ష్యాలైన మాదకద్రవ్యాల నిర్మూలన (Zero Drugs), మహిళల భద్రత (Women Safety), రహదారి భద్రత (Road Safety) గురించి వివరించారు.

గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, స్థానిక యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని, మత్తు పదార్థాల అమ్మకాలు లేదా వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల ఏమాత్రం సహించేది లేదని, మహిళల భద్రతే సమాజ భద్రత అని, ఆపద సమయాల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ప్రమాద రహిత సమాజం దిశగా రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని, నిత్యం రద్దీగా ఉండే రహదారులపై సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్ల డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, పరిమితికి మించిన వేగంతో వెళ్లకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే సహించేది లేదని హెచ్చరించారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు పంచుకోకూడదని తెలిపారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో సర్కిల్ పరిధిలోని ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta