Sullurupeta: సూళ్ళూరుపేటకు తీరనున్న తాగునీటి కష్టాలు: ఎమ్మెల్యే విజయశ్రీ!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో రూ.127 కోట్లతో చేపట్టే సమగ్ర తాగునీటి పథకానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ భూమిపూజ చేశారు. 80 వేల మందికి లబ్ధి చేకూరనుంది.
Sullurupeta: సూళ్ళూరుపేటకు తీరనున్న తాగునీటి కష్టాలు: ఎమ్మెల్యే విజయశ్రీ!
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.127 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న సమగ్ర తాగునీటి సరఫరా పథకం (UIDF - అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్) పనులకు సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ రాఘవయ్యపేటలో ఆదివారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సభలో పలువురు మాట్లాడుతూ సూళ్ళూరుపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళల కష్టాలు, ఇంటింటి నీటి ఇబ్బందులను స్వయంగా గ్రహించిన శ్రద్ధతో విజయశ్రీ ఈ భారీ ప్రాజెక్టును మంజూరు చేయించి పట్టాలెక్కించడం అభినందనీయమని కొనియాడారు. నీరు నీకోసం అన్న ఆశయంతో తాగునీటి తిప్పలు తీర్చేందుకు ఆమె చూపుతున్న చొరవపై స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
భూమిపూజ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సూళ్ళూరుపేట పట్టణ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పథకం ద్వారా సుమారు 70 వేల నుంచి 80 వేల మంది ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ప్రాజెక్టులో భాగంగా మంగళంపాడు చెరువు వద్ద 2000 KL సామర్థ్యంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, 11 MLD సామర్థ్యంతో అత్యాధునిక నీటి శుద్ధి కేంద్రం (WTP) నిర్మిస్తున్నట్లు వివరించారు. రాఘవయ్యపేటలో 1100 KL, స్త్రీశక్తి భవనం వద్ద 1200 KL, మన్నార్‌పోలూరులో 900 KL, సూళ్ళూరులో 300 KL సామర్థ్యంతో నూతన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామని చెప్పారు. కేపీ కాలువ నుంచి సూళ్ళూరుపేట వరకు గ్రావిటీ మెయిన్, పంపింగ్ మెయిన్ పైప్‌లైన్లతో పాటు పట్టణంలో 40 కిలోమీటర్ల మేర తాగునీటి పంపిణీ నెట్‌వర్క్ విస్తరించనున్నట్లు తెలిపారు.
పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట AMC ఛైర్మన్ అకుతోట రమేష్, శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ ఏ.జి. కిశోర్,టీడీపీ సీనియర్ నాయకుడు మాధవ్ నాయుడు,శ్రీనాగేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ తాటిప్రతి ఆదినారాయణరెడ్డి, కూటమి నాయకులు మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




