Sullurupeta: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకే సూళ్ళూరుపేట సీఐ హెచ్చరిక

Sullurupeta: తిరుపతి జిల్లా 2వ విడత పంచాయతీ ఎన్నికల వేళ సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ హెచ్చరిక. అక్రమార్కులు, రౌడీ షీటర్లపై ఉక్కుపాదం, సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 9 Nov 2026 8:01 PM IST
Sullurupeta
X

Sullurupeta: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకే సూళ్ళూరుపేట సీఐ హెచ్చరిక

సూళ్ళూరుపేట: ఎన్నికల వేళ గొడవలు చేస్తాం, ఓటర్లను బెదిరిస్తాం, అక్రమాలకు పాల్పడతాం అంటే కుదిరేదే లేదు! చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఎంతటి వారైనా సరే... ఉపేక్షించే ప్రసక్తే లేదు, కఠిన చర్యలు తీసుకుంటూ జైలుకు పంపుతాం!" అని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ అక్రమార్కులు, రౌడీ మూకలకు సంచలన హెచ్చరిక జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం తిరుపతి జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల రెండో విడత నిర్వహణకు జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ పూర్తి స్థాయిలోసన్నద్ధమయ్యాయి.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాలు, నాయుడుపేట డిఎస్పీ జి.చెంచుబాబు పర్యవేక్షణలో రెండో విడత ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అత్యంత ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పటిష్ట భద్రతా ప్రణాళిక రూపొందించినట్లు సీఐ వెల్లడించారు.

ఈ రెండో విడత కింద జిల్లాలోని 17 మండలాల పరిధిలో ఉన్న 362 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 3,434 వార్డు మెంబరు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి నవంబరు 18న (బుధవారం) రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు నవంబరు 20 (శుక్రవారం) చివరి తేదీ కాగా, 21న (శనివారం) పరిశీలన, 22న (ఆదివారం) అప్పీళ్ల స్వీకరణ, 23న (సోమవారం) అప్పీళ్ల పరిష్కారం పూర్తవుతాయి.

నవంబరు 24న (మంగళవారం) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. నవంబరు 29న (ఆదివారం) ఉదయం నుంచి పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైన చోట్ల నవంబరు 30న (సోమవారం) రీ-పోలింగ్ నిర్వహిస్తారు.

ఈ రెండో విడతలో సూళ్ళూరుపేట, తడ,తో పాటు చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, రామచంద్రాపురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాలెం, చిట్టమూరు, వాకాడు, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, దొరవారిసత్రం, బి.ఎన్.కండ్రిగ, సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలు ఉన్నాయి.

ముఖ్యంగా సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలోని సూళ్ళూరుపేట, తడ, మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదని, అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఐ మురళీకృష్ణ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఈ రెండు మండలాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగించేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు అమలు చేస్తోంది. గ్రామాల్లో అలజడులు సృష్టించే అవకాశం ఉన్న పాత నేరస్థులు, రౌడీ షీటర్లు, గతంలో ఎన్నికల గొడవల్లో పాల్గొన్న వారిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్) ఎదుట ముందస్తుగా బైండోవర్ చేస్తున్నామని, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు రిమాండ్‌కు తరలించి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం లేదా బలవంతంగా ఉపసంహరింపజేయడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బు, మద్యం లేదా బహుమతులు పంపిణీ చేస్తే ఊరుకోమని, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు మరియు ముఖ్య కూడళ్ల వద్ద 24 గంటలూ పనిచేసే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఆధారాలు లేకుండా రూ. 50,000 కంటే ఎక్కువ నగదు గానీ, అక్రమ మద్యం గానీ తరలిస్తే తక్షణమే సీజ్ చేస్తామని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే సైబర్ క్రైమ్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని, లైసెన్స్ ఉన్న ఆయుధాలను తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. సూళ్ళూరుపేట, తడ, మండలాల ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు, చట్టవ్యతిరేక పనులు లేదా ప్రలోభాలు జరుగుతున్నట్లు తెలిస్తే లేదా ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 100/112 నంబర్లతో పాటు సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ 9440796360, సూళ్ళూరుపేట ఎస్సై జి. అజయ్ కుమార్ 9440796361, తడ ఎస్సై కె. కొండప్ప నాయుడు 9440796362 , శ్రీహరికోట ఎస్సై భాను ప్రసన్న 9440796363 ఫోన్ నంబర్లకు నేరుగా కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta