Sullurupeta: ఎన్నికల వేళ అల్లర్లకు పాల్పడితే ఉక్కుపాదం సీఐ మురళీకృష్ణ!

Sullurupeta: సూళ్లూరుపేటలో మున్సిపల్ ఎన్నికల వేళ అల్లర్లకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని సీఐ ఎం.మురళీకృష్ణ హెచ్చరించారు. 55 పోలింగ్ స్టేషన్లలో పటిష్ట బందోబస్తు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 16 Oct 2026 9:26 PM IST
Sullurupeta
X

Sullurupeta: ఎన్నికల వేళ అల్లర్లకు పాల్పడితే ఉక్కుపాదం సీఐ మురళీకృష్ణ!

​సూళ్ళూరుపేట: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడి పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జి.చెంచుబాబు పర్యవేక్షణలో ఆయన వివరాలు వెల్లడించారు.

​ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన (స్క్రూటినీ), 21న ఉపసంహరణ, అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి ఉంటాయని తెలిపారు. తొలిరోజైన అక్టోబర్ 16వ తేదీన సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ పదవికి, వార్డు కౌన్సిలర్ స్థానాలకు ఎలాంటి నామినేషన్లూ దాఖలు కాలేదని (Nil) వెల్లడించారు. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉన్నందున, పోలీసులు మరియు నామినేషన్ కేంద్రాల వద్ద అధికారులు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా విధులు నిర్వర్తించనున్నట్లు సీఐ స్పష్టం చేశారు.

​స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో 24 పోలింగ్ లొకేషన్లు, 55 పోలింగ్ స్టేషన్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల కోసం 6 ప్రధాన కేంద్రాలు, వార్డ్ కౌన్సిలర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఐదుగురు ఎస్సైల పర్యవేక్షణలో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎక్కడపడితే అక్కడ మద్యం తాగి రోడ్లపై తిరిగినా, ప్రజలను లేదా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

రౌడీషీటర్లు, బైండోవర్ అయిన వ్యక్తులు గొడవలకు దిగితే బలమైన కేసులు నమోదు చేస్తామని, గొడవల్లో తలదూర్చి భవిష్యత్తు నాశనం చేసుకోకుండా పరిశ్రమల్లో ఉపాధి పొంది ప్రశాంతంగా జీవించాలని యువతకు హితవు పలికారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు లేదా మద్యం తరలించడం నేరమని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా పూర్తి రక్షణ కల్పిస్తామని సీఐ స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta