Sullurpeta: చెంగాళమ్మ వంతెన పునర్నిర్మాణంపై రాజకీయం దుమారం

Sullurpeta: సూళ్ళూరుపేట చెంగాళమ్మ వంతెన నిర్మాణ అంశంపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మధ్య మాటల యుద్ధం.

KKV Sudhakar, Sullurupeta
Published on: 17 Sept 2026 7:00 AM IST
Sullurpeta
X

Sullurpeta: చెంగాళమ్మ వంతెన పునర్నిర్మాణంపై రాజకీయం దుమారం

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం పక్కనున్న పురాతన వంతెన పునర్నిర్మాణంపై స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ బ్రిడ్జిని ఇటీవల పరిశీలించిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కూటమి ప్రభుత్వంపై మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

నెల్లూరు–చెన్నై జాతీయ రహదారి వైపు రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ వంతెన నిర్మాణానికి తమ జగనన్న ప్రభుత్వ హయాంలోనే రూ.35 కోట్లతో జీవో ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ప్రభుత్వం మారిన తర్వాత కూడా పనులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రతిసారీ కేవలం ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప, వంతెన నిర్మాణానికి తెచ్చిన నిధులేమీ లేవని ఎద్దేవా చేశారు. "ఫోటో పబ్లిసిటీ కాదు... నిధులు తీసుకురావాలి, పనులు ప్రారంభించాలి" అంటూ సంజీవయ్య సవాల్ విసిరారు. నెలవల కుటుంబం అవినీతిలో పోటీ పడటం మాని అభివృద్ధిలో సత్తా చూపించాలని, వారి అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని హెచ్చరించారు.

​నెలవల సుబ్రహ్మణ్యం ఘాటు కౌంటర్:

మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య చేసిన ఆరోపణలను సూళ్ళూరుపేటఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తండ్రి మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్ప క్షేత్రస్థాయిలో రూపాయి నిధులు తేలేదని మండిపడ్డారు.

రూ.35 కోట్లతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవో కేవలం కాగితాలకే పరిమితమైన పరిపాలనా అనుమతి (Administrative Sanction) మాత్రమేనని, దానికి ఆర్థిక శాఖ ఆమోదం (Financial Concurrence) గానీ, ఆర్‌ అండ్ బి శాఖాపరమైన సాంకేతిక అనుమతి (Technical Sanction) గానీ లేవని స్పష్టం చేశారు. ఆ జీవో కాగితాలు కనీసం అధికారుల వద్దకు కూడా చేరలేదని వెల్లడించారు. ఆర్థిక అనుమతులు లేని కాగితపు జీవోలతో శంకుస్థాపన రాళ్లు వేసి, టెంకాయలు కొట్టి ప్రజలను మభ్యపెట్టడం వైకాపా నాయకులకే చెల్లిందని దుయ్యబట్టారు.

​గతంలో తమ హయాంలో మంజూరైన చిగురుపాడు రోడ్డు నిధులు రూ.1.80 కోట్లు, భీమవరం స్మశానవాటిక రోడ్డు నిధులు రూ.70 లక్షలను వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేయించిందని ఆరోపించారు. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన చిగురుపాడు రోడ్డుకు రూ.1.90 కోట్లు మంజూరు చేయించి, పనులు పూర్తి చేసి ప్రారంభించారని తెలిపారు. అలాగే 2004 నుంచి నిరంతరం పోరాడి అసెంబ్లీలో గళమెత్తడం వల్లే నేడు కాళంగి, స్వర్ణముఖి నదులకు రెండు టీఎంసీల తెలుగుగంగ నీటిని సాధించుకోగలిగామని వివరించారు. ప్రజలను మోసం చేయడం మాని, నిజమైన అభివృద్ధికి వైకాపా నాయకులు సహకరించాలని హితవు చెప్పారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta