Sullurpeta: మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యపై ఎమ్మెల్యే విజయశ్రీ ఫైర్
Sullurpeta: సూళ్లూరుపేటలో వైకాపా మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ తీవ్ర ఆగ్రహం. అభివృద్ధిపై సవాల్‌కు రావాలని, అక్రమాలను వదిలేది లేదని హెచ్చరిక.
Sullurpeta: మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యపై ఎమ్మెల్యే విజయశ్రీ ఫైర్
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, వైకాపా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు ఆ పార్టీ నాయకుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అక్రమాల గురించి మాట్లాడేందుకు ఇదే తమ చివరి ప్రెస్ మీట్ అని స్పష్టం చేశారు. ఇకపై తమ పూర్తి దృష్టి నియోజకవర్గ ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపైనే ఉంటుందని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల (లోకల్ బాడీ) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడానికి, వారిని బలోపేతం చేయడానికే తాము సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు వైకాపా నాయకులు ఏ వేదికపైకి వెళ్లినా ప్రజా సమస్యలను పక్కనబెట్టి, కేవలం తమపై, తమ కుటుంబంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
తాము ఎవరి బెదిరింపులకూ భయపడే ప్రసక్తే లేదని, తమ కుటుంబ సభ్యులను గానీ, తండ్రి, భర్త, అన్నదమ్ములను గానీ అనవసరంగా రాజకీయంలోకి లాగి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై నోరు అదుపు తప్పి మాట్లాడితే కూటమి కార్యకర్తలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని తేల్చిచెప్పారు. చిల్లర విమర్శలు మానాలని, ధైర్యముంటే అభివృద్ధిపై సవాల్‌కి రావాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో కిలివేటి సంజీవయ్య ప్రాతినిధ్యంలో పంచాయతీరాజ్ సహా వివిధ శాఖల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని, సిమెంట్, ఐరన్ నిధులను పక్కదారి పట్టించి స్వాహా చేశారని ఆరోపించారు. తాము నిర్వహించిన శాఖాపరమైన రివ్యూ మీటింగ్‌లలో ఈ అక్రమాలన్నీ ఆధారాలతో సహా బయటపడ్డాయని, సరైన సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాన్నీ చట్టం ముందుకు తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, హంద్రీనీవా ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. అదే రీతిలో సూళ్లూరుపేట నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనుల జాతర జరుగుతోందన్నారు.
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ప్రధాన రోడ్ల నిర్మాణం కోసం ₹41 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల రోడ్ల మరమ్మతులు, నిర్మాణాల కోసం పంచాయతీరాజ్ శాఖ కింద మరో ₹9 కోట్లు కేటాయించామని వివరించారు. కాలంగి బ్రిడ్జ్ నిర్మాణం, సూళ్లూరుపేట పట్టణంలో క్లాక్ టవర్ నిర్మాణం, సుందరీకరణ (బ్యూటీఫికేషన్) పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.
అంతేకాకుండా, గత 20 ఏళ్లుగా స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న డెంపింగ్ యార్డ్‌ను అక్కడి నుండి తరలించి, ఆ స్థలంలో ప్రజల కోసం ఆహ్లాదకరమైన మోడల్ పార్క్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. వైకాపా నాయకులు గంజాయి, పాన్ పరాక్ అని చిల్లర మాటలు7 మాట్లాడటం మానేసి, ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హితవు పలికారు.




