Sullurpeta: సూళ్ళూరుపేట అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ సమీక్ష

Sullurpeta: సూళ్ళూరుపేట నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల ఆదేశం.

KKV Sudhakar, Sullurupeta
Published on: 28 Sept 2026 9:54 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేట అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ సమీక్ష

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా ​సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించడమే తమ ప్రధాన లక్ష్యమని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్పష్టం చేశారు. సూళ్ళూరుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు సంక్షేమ పథకాల అమలుపై నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆమె సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సూళ్ళూరుపేట ఆర్‌డీఓ దేవేంద్రరెడ్డి, నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబులతో పాటు నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం, అంతర్గత రహదారుల అభివృద్ధి, విద్యుత్ సమస్యల పరిష్కారం, రెవెన్యూ సంబంధిత అంశాలు మరియు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై శాఖల వారీగా ఆరా తీశారు.

అధికారులు ప్రతి రెండు వారాలకు లేదా నెలకు ఒకసారి తమ పరిధిలోని పనులపై అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహించుకుని క్షేత్రస్థాయి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని, ప్రజల నుంచి వచ్చే అర్జీలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలల్లో తాగునీరు, శౌచాలయాలు, మధ్యాహ్న భోజన నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఎంఈఓలను ఆదేశించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును సీడీపీఓలు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పంచాయతీ భవనాలు, ఆర్‌బీకేలు, విలేజ్ హెల్త్ సెంటర్ల వివరాలతో ఆర్‌డీఓకు నివేదిక ఇవ్వాలని, ఎస్‌డీఎఫ్ నిధుల పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రైతాంగానికి 'అన్నదాత సుఖీభవ' నమోదు ప్రక్రియను సజావుగా పూర్తి చేసి, యూరియా మరియు నాణ్యమైన విత్తనాల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు స్పష్టం చేశారు.

అలాగే చెంబేడు రిజర్వాయర్, దొరవారిసత్రం మండలంలో మీన్‌జూరు చెక్‌డ్యామ్‌లు, గ్రోయిన్ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పెళ్లకూరు, భీమవరం పరిధిలో ఎస్టీ పేదలు సాగు చేసుకుంటున్న భూములకు అటవీ శాఖతో సర్వే చేయించి కలెక్టర్‌కు నివేదిక పంపాలని, ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చే ఉచిత సోలార్ ప్యానెల్స్ పథకంపై అవగాహన పెంచాలని ఆదేశించారు.

మరోవైపు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ఎమ్మెల్యే కొనియాడారు. రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ, ఎస్సై జి. అజయ్ కుమార్లతో పాటు తోటి సిబ్బందికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పట్టణంలో నేరాల నియంత్రణకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొంటూ, పట్టణంలో ఉన్న చిన్నపాటి ట్రాఫిక్ సమస్య కూడా త్వరలోనే పూర్తిగా పరిష్కారం కానుందని వివరించారు.

సమావేశంలో ఆర్‌డీఓ దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని, పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు పెంచుతామని వివరించారు.

ప్రతి శాఖ కనబరిచే పనితీరుపైనే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుందని, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta