Sullurpeta: సూళ్ళూరుపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా మంగానెల్లూరు తులసి

Sullurpeta: సూళ్ళూరుపేట పురపాలక సంఘం వైస్ ఛైర్మన్‌గా 22వ వార్డు కౌన్సిలర్ మంగానెల్లూరు తులసి ఎంపిక; 29 మంది కౌన్సిలర్ల మద్దతు, నేతల అభినందనలు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 23 Nov 2026 4:31 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్ళూరుపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా మంగానెల్లూరు తులసి

సూళ్ళూరుపేట: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచీ జెండా మోసిన కార్యకర్తకు, నియోజకవర్గస్థాయిలో బీసీ నేతగా పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించిన సీనియర్ నాయకుడి కుటుంబానికి తెదేపా అధిష్ఠానం సముచిత గౌరవం కల్పించింది. ప్రముఖ కూరగాయల వ్యాపారి, తెదేపా సీనియర్ నేత చిట్టేటి పెరుమాళ్ కుమార్తె మంగానెల్లూరు తులసి సూళ్ళూరుపేట పురపాలక సంఘం వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. గత పురపాలక సంఘ ఎన్నికల్లో 22వ వార్డు నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగిన తులసి, ప్రత్యర్థులపై అఖండ మెజారిటీతో ఘనవిజయం సాధించి తన సత్తా చాటారు. నాటి నుంచి వార్డు సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆమెను, వైస్ ఛైర్మన్ పదవికి అధిష్ఠానం ఎంపిక చేయగా, కౌన్సిల్ సమావేశ మందిరంలో కూటమి పార్టీలకు చెందిన 29 మంది కౌన్సిలర్లు తులసికి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించారు.

​దశాబ్దాల పాటు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, నిస్వార్థ సేవలు అందించిన చిట్టేటి పెరుమాళ్ విధేయతను గుర్తించి ఆయన కుమార్తెకు పురపాలక సంఘంలో కీలక బాధ్యతలు అప్పగించడంపై స్థానిక తెదేపా శ్రేణులు, బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూళ్ళూరుపేటలో తండ్రి చిట్టేటి పెరుమాళ్‌కు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఆ గౌరవాన్ని, మంచి పేరును తులసి తప్పక నిలబెడుతుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేసే తత్వం ఉన్న ఆమె, పట్టణ అభివృద్ధికి కూడా అదే ఉత్సాహంతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

​ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ.. తమకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, తెదేపా సీనియర్ నేత వేనాటి సతీష్ రెడ్డిల ఆశీస్సులు, దీవెనలు పుష్కలంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. అధిష్ఠానం, కూటమి నేతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపేతానికి, సూళ్ళూరుపేట పురపాలక సంఘం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందనడానికి ఈ ఎంపికే నిదర్శనమని పలువురు నాయకులు కొనియాడారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta