Sullurpeta: సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే వేళ సూళ్లూరుపేటలో హెల్మెట్ల పంపిణీ

Sullurpeta: సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా సూళ్లూరుపేటలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన సీఐ మురళీకృష్ణ.

KKV Sudhakar, Sullurupeta
Published on: 14 Oct 2026 8:05 PM IST
Sullurpeta
X

Sullurpeta: సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే వేళ సూళ్లూరుపేటలో హెల్మెట్ల పంపిణీ

సూళ్లూరుపేట: ​సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలలో భాగంగా మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో కన్వీనర్ మాభాష ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై వెళ్తున్న హెల్మెట్ లేని 15 మంది యువకులకు హెల్మెట్లు పంపిణీ చేసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ట , ఎస్సై జి.అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఐ ఎం.మురళీ కృష్ట మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు ఎంత ముఖ్యమో వివరించారు.

హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు అయ్యి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, హెల్మెట్ కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే కవచమని హెచ్చరించారు.

ప్రయాణంలో వేగం కంటే గమ్యానికి సురక్షితంగా చేరడమే ముఖ్యమని యువత గ్రహించాలని సూచించారు. సమాజంలో యువత ప్రాణాల విలువను గుర్తించి బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ సూళ్ళూరుపేట సభ్యులు కయ్యాల కోటి యాదవ్, నక్క హరిబాబు, ఆవుల దాస్, సుజాత, పద్మజ, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో కన్వీనర్ మాభాష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు యువత రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి, మీ భద్రతే మీ కుటుంబానికి నిజమైన భరోసా అని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta