Sullurpeta: సూళ్ళూరుపేటలో 41 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఐ
Sullurpeta: సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో గల 41 పోలింగ్ కేంద్రాలను సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Sullurpeta: సూళ్ళూరుపేటలో 41 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సీఐ
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పురపాలక సంఘం పరిధిలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని సూళ్ళూరుపేట ఎస్సై జి. అజయ్ కుమార్, తడ ఎస్సై కె. కొండప్ప నాయుడు, శ్రీహరికోట ఎస్సై భాను ప్రసన్న, సూళ్ళూరుపేట సెకండ్ ఎస్సై సి. సుబ్రహ్మణ్యం రాజుతో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ స్థానిక 32 వార్డుల్లో ఉన్న 41 పోలింగ్ స్టేషన్లను స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల ప్రాంగణాలు, చుట్టుపక్కల కాంపౌండ్ గోడలు, ప్రవేశ మార్గాలు, భద్రతాపరమైన అంశాలను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించిన అనంతరం సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని రకాల ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలిస్తూ, ఎక్కడా ఎలాంటి చిన్నపాటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ తెలపడంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, సజావుగా, శాంతియుతంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ఈ సందర్భంగా వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పిలుపునిచ్చారు.




