Sullurpeta: సూళ్ళూరుపేటలో ప్రశాంతంగా మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ!
Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సీఐ
Sullurpeta: సూళ్ళూరుపేటలో ప్రశాంతంగా మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ!
Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ముందుండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శ్రీసిటీ డీఎస్పీ బి.వి. శ్రీనివాసులు పర్యవేక్షణలో, సీఐ ఎం.మురళీకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆరుగురు ఎస్ఐలు, 57 మంది పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పార్టీ బలగాలను సమన్వయం చేస్తూ ఆయన నేతృత్వంలో పోలీసులు అడుగడుగునా అప్రమత్తంగా నిఘా పెట్టారు.
ఈ సందర్భంగా సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ అత్యంత కఠినంగా స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే వాతావరణం కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. వర్షం కురుస్తున్నప్పటికీ, భద్రతా సిబ్బంది ఏమాత్రం వెనకడుగు వేయకుండా వర్షాన్ని లెక్కచేయకుండా అప్రమత్తంగా విధులను నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.
ఎన్నికల వేళ ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూసినా, అభ్యర్థులు లేదా వారి మద్దతుదారులు గొడవలు, అల్లర్లకు పాల్పడితే ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే భారీ స్థాయిలో కఠిన కేసులు నమోదు చేసి చట్టపరంగా తీవ్ర చర్యలు తీసుకుంటామని, అందరూ నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు చేసుకోవాలని తేల్చిచెప్పారు.
పోలీసుల ఈ పటిష్ట నిఘా నీడలో సూళ్ళూరుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు మంచి స్పందనతో కొనసాగింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ నుంచి రెండు నామినేషన్లు దాఖలు కాగా, వార్డు కౌన్సిలర్ స్థానాలకు మొత్తం 47 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వైకాపా నుంచి 19, టీడీపీ నుంచి 16, బీజేపీ నుంచి 4, జనసేన నుంచి 2, ఇతరులు/స్వతంత్రుల నుంచి 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
చైర్మన్, కౌన్సిలర్ స్థానాలకు కలిపి రెండో రోజు మొత్తం 49 నామినేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్ 18 తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండటంతో చివరి రోజు మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని, ఎటువంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పూర్తి బందోబస్తుతో సిద్ధంగా ఉన్నామని సీఐ ఎం.మురళీకృష్ణ తెలిపారు.




