Srikalahasti: సైకిల్‌పై 6,000 కిలోమీటర్ల ఆధ్యాత్మిక యాత్ర!

Srikalahasti: శ్రీకాళహస్తి యువకుడు విద్యాసాగర్ సైకిల్‌పై 6,000 కి.మీల ఆధ్యాత్మిక యాత్ర. ఎటువంటి సౌకర్యాలు లేకుండా టెంట్లలో నిద్రిస్తూ సాగిస్తున్న యాత్ర స్ఫూర్తిదాయకం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 17 Sept 2026 11:39 AM IST
Srikalahasti
X

Srikalahasti: సైకిల్‌పై 6,000 కిలోమీటర్ల ఆధ్యాత్మిక యాత్ర!

Srikalahasti: ఆధ్యాత్మికతపై ఉన్న ఆసక్తిని తన సైకిల్‌ యాత్రగా మలుచుకున్నాడు శ్రీకాళహస్తికి చెందిన కె. విద్యాసాగర్‌(22). దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను సైకిల్‌పై సందర్శిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 6 వేల కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై ప్రయాణించి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు.

ఎలాంటి ప్రత్యేక వాహనం, బృందం, సౌకర్యాలు లేకుండా సొంత ఖర్చులతోనే ఈ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించడం విద్యాసాగర్‌ ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రతిరోజూ సైకిల్‌పై నిర్దేశించుకున్న దూరం ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఎదురయ్యే ఆలయాలను సందర్శిస్తున్నాడు.

రాత్రి వేళల్లో సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకుని టెంటు ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ, సాధారణ ఆహారం తీసుకుని మరుసటి రోజు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఎండ, వర్షం, అలసట వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ప్రయాణంలో ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశిష్టతలను తెలుసుకునే అవకాశం లభిస్తోందని విద్యాసాగర్‌ చెబుతున్నాడు.

ఈ యాత్రలో ఎదురయ్యే కష్టాలు తనకు బాధగా కాకుండా ఒక అనుభూతిగా, ఆధ్యాత్మిక అన్వేషణగా అనిపిస్తున్నాయని అంటున్నాడు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, తన సొంత ఖర్చులతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆలయ దర్శనం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతున్నానని విద్యాసాగర్‌ పేర్కొంటున్నాడు.

యువతలో ఆధ్యాత్మికతతో పాటు సాహసం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి పెంచేలా తన సైకిల్‌ యాత్ర ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. మరిన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే లక్ష్యంతో తన సైకిల్‌ యాత్రను కొనసాగిస్తున్న విద్యాసాగర్‌ ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI